AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆపరేషన్ సిందూర్ హీరో ఏకే భారతికి సర్వోత్తమ్ యుద్ధ సేవా మెడల్..

‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో తన వాక్చాతుర్యంతో, నిశిత మేధస్సుతో దేశవ్యాప్తంగా హీరోగా నిలిచిన ఎయిర్ మార్షల్ అవధేష్ కుమార్ భారతికి ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించింది. దేశ రక్షణలో ఆయన చూపిన అసమాన ప్రతిభకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆయనను దేశంలోని అత్యున్నత యుద్ధ సేవా పురస్కారమైన ‘సర్వోత్తమ్ యుద్ధ సేవా మెడల్’తో గౌరవించింది.

 

79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సాయుధ దళాల సిబ్బందికి అందించే శౌర్య, సేవా పురస్కారాల జాబితాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం ఆమోదించారు. ఈ జాబితాలో ఎయిర్ మార్షల్ ఏకే భారతి పేరు ప్రత్యేకంగా నిలిచింది. బీహార్‌కు చెందిన భారతి, ప్రస్తుతం ఎయిర్ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో శత్రు లక్ష్యాలను గుర్తించి, వాటిని విజయవంతంగా అమలు చేయడంలో ఆయన వ్యూహాత్మక నైపుణ్యం కీలక పాత్ర పోషించింది.

 

ఆపరేషన్ సమయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడిన తీరు దేశ ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. మే 13న జరిగిన ఓ సమావేశంలో ఆయన రామచరితమానస్‌లోని ‘బినయ్ న మానత్ జలధి జడ్, గయే తీన్ దిన్ బీత్, బోలే రామ్ సకోప్ తబ్, భయ్ బిను హోయి న ప్రీతి’ అనే పంక్తులను ఉటంకిస్తూ… ‘తెలివైన వారికి సైగ చేస్తే చాలు’ అని పరోక్షంగా పాకిస్థాన్‌కు గట్టి హెచ్చరిక పంపారు. ఈ ఒక్క వ్యాఖ్యతో ఆయన దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు.

 

అంతేకాకుండా, పాకిస్థాన్‌లోని కైరాణా హిల్స్‌పై వైమానిక దళం దాడి చేసిందా అని ఓ విలేకరి ప్రశ్నించగా.. ‘అక్కడ అణు కేంద్రాలు ఉన్నాయని మీ ద్వారా తెలిసినందుకు ధన్యవాదాలు. ఆ విషయం మాకు తెలియదు. మేము కైరాణా హిల్స్‌పై దాడి చేయలేదు’ అని ఆయన వ్యంగ్యంగా బదులిచ్చిన తీరు ఆయన సమయస్ఫూర్తికి నిదర్శనంగా నిలిచింది.

 

ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి మొత్తం 127 శౌర్య పురస్కారాలు, 40 విశిష్ట సేవా పురస్కారాలకు ఆమోదం తెలిపారు. వీటిలో 4 కీర్తి చక్ర, 15 వీర్ చక్ర, 16 శౌర్య చక్ర, 58 సేనా పతకాలు, 26 వాయుసేనా పతకాలతో పాటు 7 సర్వోత్తమ్ యుద్ధ సేవా పతకాలు ఉన్నాయి.

ANN TOP 10