AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కలెక్టరేట్‌లో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మహిళా ఉద్యోగి..!

ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని అరికట్టేందుకు అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కొందరు ఉద్యోగుల తీరు మారడం లేదు. ఏకంగా జిల్లా పరిపాలన కేంద్రమైన కలెక్టరేట్‌లోనే ఓ మహిళా ఉద్యోగి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు అడ్డంగా దొరికిపోయింది. వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది.

 

వివరాల్లోకి వెళితే.. ఫిర్యాదుదారుడి తల్లికి ప్రభుత్వం రెండు ఎకరాల భూమిని కేటాయించింది. ఆ భూమికి సంబంధించిన దస్త్రాల్లో ఆమె పేరును చేర్పించేందుకు బాధితుడు కలెక్టర్ కార్యాలయాన్ని ఆశ్రయించాడు. అక్కడి జూనియర్ అసిస్టెంట్ కె. సుజాత ఈ పనిని పూర్తి చేయడానికి, సంబంధిత పత్రాలను నవాబ్‌పేట తహశీల్దార్ కార్యాలయానికి పంపడానికి రూ.15,000 లంచం డిమాండ్ చేసింది.

 

లంచం ఇవ్వడానికి ఇష్టపడని బాధితుడు నేరుగా తెలంగాణ ఏసీబీ అధికారులను సంప్రదించాడు. ఆయన ఫిర్యాదు ఆధారంగా పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన ఏసీబీ బృందం.. మంగళవారం సుజాత ఫిర్యాదుదారుడి నుంచి రూ.15,000 లంచం తీసుకుంటుండగా ఆమెను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. అనంతరం ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. జిల్లా పరిపాలన కేంద్రంలోనే ఈ ఘటన జరగడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

 

ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు ప్రజలకు కీలక సూచన చేశారు. ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా లంచం అడిగితే ఏమాత్రం భయపడకుండా తమకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064కు ఫోన్ చేయాలని తెలిపారు. వాట్సాప్ (9440446106), ఫేస్‌బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) వంటి సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని అధికారులు హామీ ఇచ్చారు.

ANN TOP 10