మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో తీవ్ర కలకలం రేపిన ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఉన్న ఓ ప్రముఖ బేకరీలో విక్రయించిన కర్రీ పఫ్లో చనిపోయిన పాము కనిపించడంతో వినియోగదారులు భయాందోళనకు గురయ్యారు. బాధితురాలి ఫిర్యాదుతో ఈ విషయం బయటకు పొక్కింది.
వివరాల్లోకి వెళితే.. జడ్చర్లకు చెందిన శ్రీశైల అనే మహిళ మంగళవారం స్థానిక బేకరీకి వెళ్లారు. అక్కడ తన పిల్లల కోసం ఒక ఎగ్ పఫ్, ఒక కర్రీ పఫ్ కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లారు. ఇంట్లో పిల్లలతో కలిసి తినేందుకు కర్రీ పఫ్ను తెరిచి చూడగా, అందులో చనిపోయి ఉన్న పాము పిల్లను చూసి ఆమె ఒక్కసారిగా నివ్వెరపోయారు. వెంటనే తేరుకుని, ఆ పఫ్ను తీసుకుని నేరుగా బేకరీ వద్దకు వెళ్లారు.
ఈ విషయంపై బేకరీ యజమానిని నిలదీయగా, ఆయన నిర్లక్ష్యంగా, పొంతన లేని సమాధానాలు చెప్పినట్లు బాధితురాలు ఆరోపించారు. యజమాని తీరుతో తీవ్ర ఆగ్రహానికి గురైన శ్రీశైల, తన కుటుంబ సభ్యులతో కలిసి జడ్చర్ల పోలీస్ స్టేషన్కు వెళ్లి బేకరీ యాజమాన్యంపై అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఆహార పదార్థాల విషయంలో ఇంతటి నిర్లక్ష్యం వహించడంపై స్థానికులు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.