భారత రక్షణ రంగానికి సంబంధించిన అత్యంత కీలకమైన సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేస్తున్నాడన్న ఆరోపణలతో ఒక వ్యక్తిని రాజస్థాన్ సీఐడీ (సెక్యూరిటీ) ఇంటెలిజెన్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. జైసల్మేర్‌లోని చందన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లో ఉన్న డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ) గెస్ట్ హౌస్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న మహేంద్ర ప్రసాద్ (32) ఈ గూఢచర్యానికి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. దేశ భద్రతకు సంబంధించిన వ్యూహాత్మక ప్రాంతంలోనే ఇలాంటి ఘటన జరగడం తీవ్ర కలకలం రేపింది.
ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లా, పల్యున్ గ్రామానికి చెందిన మహేంద్ర ప్రసాద్, డీఆర్‌డీఓ గెస్ట్ హౌస్‌లో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా దేశ వ్యతిరేక కార్యకలాపాలపై నిఘాను కట్టుదిట్టం చేశామని, ఈ క్రమంలోనే మహేంద్ర ప్రసాద్ వ్యవహారం తమ దృష్టికి వచ్చిందని సీఐడీ ఐజీ డాక్టర్ విష్ణుకాంత్ తెలిపారు. అతను సోషల్ మీడియా ద్వారా పాకిస్థానీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ హ్యాండ్లర్‌తో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు తమ దర్యాప్తులో తేలిందని ఆయన వివరించారు.
చందన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ అనేది క్షిపణులు, ఇతర ఆయుధాల పరీక్షలకు భారత సైన్యం, డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలు తరచుగా సందర్శించే అత్యంత ముఖ్యమైన ప్రదేశం. ఈ గెస్ట్ హౌస్‌కు వచ్చే శాస్త్రవేత్తలు, సైనికాధికారుల కదలికలు, వారి పర్యటన వివరాలను మహేంద్ర ప్రసాద్ తన పాకిస్థానీ హ్యాండ్లర్‌కు చేరవేస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు.
మహేంద్ర ప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్న భద్రతా ఏజెన్సీలు, సంయుక్తంగా విచారించాయి. అతని మొబైల్ ఫోన్‌ను సాంకేతికంగా విశ్లేషించగా, డీఆర్‌డీఓ కార్యకలాపాలు, భారత సైన్యానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్థాన్ హ్యాండ్లర్‌తో పంచుకున్నట్లు బలమైన ఆధారాలు లభ్యమయ్యాయి. ఈ ఆధారాలతో మంగళవారం అతడిని గూఢచర్యం ఆరోపణలపై అధికారికంగా అరెస్ట్ చేశారు.
ఈ గూఢచర్య నెట్‌వర్క్‌లో ఇంకెవరైనా ఉన్నారా? అనే కోణంలో అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ అరెస్టుతో దేశంలోని వ్యూహాత్మక సంస్థలే లక్ష్యంగా విదేశీ గూఢచార సంస్థల ముప్పు కొనసాగుతోందని మరోసారి స్పష్టమైంది. సున్నితమైన ప్రాంతాల్లో పనిచేసే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కదలికలను వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని భద్రతా ఏజెన్సీలు విజ్ఞప్తి చేశాయి.