AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సింగపూర్‌ను తాకిన ‘కూలీ’ ఫీవర్..! ఉద్యోగులకు పెయిడ్ హాలిడే ప్రకటించిన కంపెనీ..

సూపర్‌స్టార్ రజినీకాంత్ సినిమా వస్తోందంటే అభిమానుల సంబరాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ క్రేజ్ ఇప్పుడు దేశ సరిహద్దులు దాటింది. రజినీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘కూలీ’ కోసం సింగపూర్‌లోని ఓ సంస్థ తమ ఉద్యోగులకు ఏకంగా వేతనంతో కూడిన సెలవు ప్రకటించడం ఇప్పుడు సంచలనంగా మారింది.

 

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నివేదికల ప్రకారం, సింగపూర్‌కు చెందిన ఒక సంస్థ తమ కంపెనీలో పనిచేస్తున్న తమిళ ఉద్యోగులకు ‘కూలీ’ సినిమా చూసేందుకు ప్రత్యేకంగా పెయిడ్ హాలిడే ఇచ్చింది. అంతేకాకుండా, సినిమా విడుదలయ్యే తొలిరోజే ఫస్ట్ షో టికెట్లు, తినుబండారాల ఖర్చుల కోసం 30 సింగపూర్ డాలర్లు కూడా అందిస్తామని ప్రకటించింది. దీనిని తమ “ఉద్యోగుల సంక్షేమం, ఒత్తిడి నిర్వహణలో భాగమైన కార్యక్రమం”గా ఆ సంస్థ పేర్కొన్నట్లుగా ఉన్న ఓ నోటీసు ప్రస్తుతం నెట్టింట‌ వైరల్ అవుతోంది. ఈ వార్తతో ఇండియాలోని రజినీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

 

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై మొదటి నుంచే అంచనాలు ఆకాశాన్ని అంటాయి. రజినీకాంత్‌తో పాటు టాలీవుడ్ కింగ్ నాగార్జున, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర, శ్రుతి హాసన్, సత్యరాజ్ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రల్లో నటిస్తుండటంతో సినిమాపై హైప్ మరింత పెరిగింది. ఇటీవల విడుదలైన ట్రైలర్, అనిరుధ్ సంగీతం సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చాయి. ఇప్పటికే ఈ చిత్రం తమిళ సినిమా చరిత్రలోనే అత్యధిక ధరకు ఓవర్సీస్ హక్కులు అమ్ముడై రికార్డు సృష్టించింది. ఈ నెల‌ 14న ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాల్లో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

 

ఇంతటి భారీ అంచనాల మధ్య సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సెన్సార్ బోర్డు) ఈ చిత్రానికి ‘ఏ’ సర్టిఫికెట్ జారీ చేయడం కొంతమంది అభిమానుల్లో ఆందోళనకు కారణమైంది. రజినీకాంత్ చిత్రాలకు కుటుంబ ప్రేక్షకులు, పిల్లలు పెద్ద సంఖ్యలో వస్తారు. ‘ఏ’ సర్టిఫికెట్ కారణంగా వారు సినిమాకు దూరమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా, సినిమా విడుదలకు మరికొన్ని రోజులే మిగిలి ఉండటంతో ‘కూలీ’ ఫీవర్ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఉర్రూతలూగిస్తోంది.

 

ANN TOP 10