AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఏపీలో లాజిస్టిక్స్ కార్పొరేషన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్.. !

ఏపీ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని కీలకమైన పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల మొదటి దశ పనులను త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా ఈ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను వేగవంతం చేయాలని, వాటిని రాష్ట్రానికి ఆర్థిక వనరులుగా మార్చాలని ఆయన సూచించారు.

 

సోమవారం ఉండవల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో పోర్టులు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో చంద్రబాబు ఈ మేరకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో రవాణా, సరఫరా వ్యవస్థలను మరింత పటిష్ఠం చేసేందుకు ఏపీ లాజిస్టిక్స్ కార్పొరేషన్‌ను త్వరితగతిన ఏర్పాటు చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పోర్టులు, విమానాశ్రయాలు, రహదారులను అనుసంధానిస్తూ సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు. దీని ద్వారా లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గించి, ఎగుమతి సామర్థ్యాన్ని పెంచవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

 

పోర్టులు, పారిశ్రామిక ప్రాంతాలకు అనుసంధానం మెరుగుపరిచేందుకు, ట్రాఫిక్ అవసరాలకు అనుగుణంగా పీపీపీ పద్ధతిలో రహదారుల విస్తరణ చేపట్టాలని అధికారులకు తెలిపారు. స్థానిక మత్స్యకారుల ప్రయోజనాలకు ఎలాంటి భంగం కలగకుండా, కొన్ని ఫిషింగ్ హార్బర్లను మైనర్ పోర్టులుగా అప్‌గ్రేడ్ చేసే అవకాశాలను పరిశీలించాలని సీఎం కోరారు. మచిలీపట్నం, రామాయపట్నం, మూలపేట, కాకినాడ గేట్‌వే పోర్టులతో పాటు, జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ల తొలి దశ పనులను గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.

ANN TOP 10