ప్రధాని నరేంద్ర మోదీ శనివారం హైదరాబాద్ పర్యటనకు వస్తున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేసేందుకు మోదీ వస్తున్నారు. దీంతో మోదీ పర్యటనకు అధికారులు భారీగా ఏర్పాట్లు చేస్తోన్నారు. బీజేపీ శ్రేణులు కూడా ఘన స్వాగతం పలికేందుకు రెడీ అవుతున్నారు. మోదీ టూర్‌ను విజయవంతం చేయాలని ప్రభుత్వ వర్గాలు, కాషాయ శ్రేణులు భావిస్తున్నాయి. శనివారం మోదీ పర్యటన కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.
మోదీ పర్యటన దృష్ట్యా పలు కొన్ని ప్రాంతాల్లో అవసరమైన సమయంలో ట్రాఫిక్‌ను నిలిపివేయడంతో పాటు ట్రాఫిక్‌ను దారి మళ్లించనున్నారు. వీటికి సంబంధించి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు పలు కీలక సూచనలు జారీ చేశారు. పరేడ్ గ్రౌండ్స్‌లో మోదీ పర్యటన దృష్ట్యా మోనప్ప (రాజీవ్ గాంధీ విగ్రహం)–గ్రీన్ ల్యాండ్స్ – ప్రకాష్‌నగర్–రసూల్‌పురా–CTO– ప్లాజా–SBH–YMCA–సెయింట్ జాన్ రోటరీ-సంగీత్ క్రాస్‌రోడ్-ఆలుగడ్డ బావి-మెట్టుగూడ – చిల్కలగూడ-టివోలి-బాలమ్రాయ్ – స్వీకర్ ఉపకార్-సికింద్రాబాద్ క్లబ్-తిరుమల గిరి- తాడ్‌బండ్ – సెంట్రల్ పాయింట్ మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఉండనుందని పేర్కొన్నారు.
మోదీ పర్యటన సమయంలో టివోలి క్రాస్ రోడ్ నుంచి ప్లాజా క్రాస్ రోడ్ వరకు, ఎస్‌బీహెచ్ క్రాస్‌రోడ్డు నుంచి స్వీకర్ ఉప్కార్ జంక్షన్ మధ్య రోడ్డును మూసివేయనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, పరేడ్ గ్రౌండ్స్ వైపు వచ్చే వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.