వాహనదారులకు భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) ఒక శుభవార్త అందించింది. టోల్ ప్లాజాల వద్ద చెల్లింపులను మరింత సులభతరం చేసేందుకు ‘ఫాస్టాగ్ వార్షిక పాస్’ను ప్రవేశపెట్టనుంది. ఈ కొత్త పథకం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15, 2025 నుంచి అందుబాటులోకి రానుంది. తరచుగా జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి పదేపదే రీఛార్జ్ చేసుకునే శ్రమను తగ్గించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం.
ఈ వార్షిక పాస్ ధరను రూ. 3,000గా నిర్ణయించారు. ఈ మొత్తాన్ని చెల్లించిన ప్రైవేట్ వాహన యజమానులు ఏడాది పాటు లేదా 200 ట్రిప్పుల వరకు టోల్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. కార్లు, జీపులు, వ్యాన్‌ల వంటి వాణిజ్యేతర వాహనాలకు మాత్రమే ఈ సౌకర్యం వర్తిస్తుంది. ఈ పాస్‌ను కొనుగోలు చేయాలంటే వాహనానికి ఇప్పటికే ఫాస్టాగ్ యాక్టివ్‌గా ఉండాలి. ‘రాజ్‌మార్గ్ యాత్ర’ యాప్ లేదా NHAI అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
అయితే, ఈ పాస్ కేవలం NHAI, కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ పరిధిలోని జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలపై మాత్రమే చెల్లుబాటు అవుతుందని అధికారులు స్పష్టం చేశారు. ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వే, సమృద్ధి మహామార్గ్, అటల్ సేతు వంటి రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని రహదారులపై ఈ పాస్ పనిచేయదు. అటువంటి మార్గాలలో ప్రయాణించేటప్పుడు ఫాస్టాగ్ వ్యాలెట్ నుంచి యథావిధిగా టోల్ రుసుము కట్ అవుతుంది.
ఒక వాహనంపై తీసుకున్న పాస్‌ను మరో వాహనానికి బదిలీ చేయడానికి వీలుండదు. అలాగే, 200 ట్రిప్పులు లేదా ఏడాది గడువు ముగిసిన తర్వాత పాస్ గడువు ముగుస్తుంది. వినియోగదారులు కావాలనుకుంటే మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పాస్‌కు ఆటో-రెన్యూవల్ సౌకర్యం లేదు.