భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. భారత వస్తువులపై 25 శాతం సుంకం విధించిన నేపథ్యంలో, కొన్ని దేశాలు భారత ఆర్థిక పురోగతిని అసూయతో చూస్తూ, దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. “కొందరు ‘బాస్’లు భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న వేగాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మనమే అందరికీ బాస్ అయితే, భారత్ ఇంత వేగంగా ఎలా అభివృద్ధి చెందుతోందని వారు అనుకుంటున్నారు?” అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. మధ్యప్రదేశ్‌లోని రైసెన్ జిల్లా, ఉమరియా గ్రామంలో బీఈఎంఎల్ (BEML) కొత్త యూనిట్‌కు శంకుస్థాపన చేసిన సందర్భంగా రాజ్ నాథ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
“కొన్ని దేశాలు భారతీయ ఉత్పత్తులను ఇతర దేశాల ఉత్పత్తుల కంటే ఖరీదైనవిగా చేయడానికి ప్రయత్నిస్తున్నాయి, తద్వారా ధరలు పెరిగితే ప్రపంచం వాటిని కొనడం మానేస్తుంది” అని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. అయినప్పటికీ, “భారత్ ఇంత వేగంగా ముందుకు సాగుతోంది, ఇప్పుడు ఏ శక్తీ భారత్‌ను ప్రపంచంలో ఒక గొప్ప శక్తిగా ఎదగకుండా ఆపలేదు” అని ఆయన ధీమాగా చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో 2014లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రక్షణ రంగంలో అద్భుతమైన మార్పు వచ్చిందన్నారు. “ఒకప్పుడు ఆయుధాల నుంచి యుద్ధ విమానాల వరకు దిగుమతి చేసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు మనం వాటిని మన దేశంలోనే తయారు చేయడమే కాకుండా, ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. ఒకప్పుడు అతి తక్కువగా ఉన్న మన రక్షణ ఎగుమతులు ఇప్పుడు ఏకంగా రూ. 24,000 కోట్లకు పెరిగాయి. ఇది మన పెరుగుతున్న సామర్థ్యానికి నిదర్శనం” అని ఆయన వివరించారు. దేశ భద్రతను బలోపేతం చేయడంతో పాటు, రక్షణ రంగం దేశ ఆర్థిక ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు.