AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అమెరికా శాటిలైట్‌తో ఇస్రో సరికొత్త చరిత్ర..

ఒకప్పుడు చిన్న రాకెట్ కోసం అగ్రరాజ్యం అమెరికా వైపు చూసిన భారత్, ఇప్పుడు అదే అమెరికాకు చెందిన భారీ ఉపగ్రహాన్ని తన సొంత గడ్డపై నుంచి నింగిలోకి పంపే స్థాయికి ఎదిగింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) త్వరలో ఈ చరిత్రాత్మక ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఇటీవల నాసా-ఇస్రో సంయుక్త ‘నైసర్’ మిషన్‌ను విజయవంతం చేసిన ఉత్సాహంతో, మరో కీలక ఘట్టానికి నాంది పలుకుతోంది.

 

చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఇస్రో ఛైర్మన్ వి. నారాయణన్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. రాబోయే రెండు నెలల్లో అమెరికాకు చెందిన 6,500 కిలోల బరువైన కమ్యూనికేషన్ శాటిలైట్‌ను భారత రాకెట్ ద్వారా ప్రయోగించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన గతాన్ని గుర్తుచేసుకుంటూ, భారత అంతరిక్ష ప్రస్థానంలోని అద్భుతమైన పురోగతిని వివరించారు.

 

“ఆరు దశాబ్దాల క్రితం అమెరికా నుంచి మనం ఓ చిన్న రాకెట్‌ను అందుకున్నాం. కానీ ఇప్పుడు, అదే అమెరికా తయారు చేసిన భారీ ఉపగ్రహాన్ని మన రాకెట్ తో, మన భూభాగం నుంచి ప్రయోగించబోతున్నాం. ఇది ఎంతటి అద్భుతమైన ప్రగతి?” అని ఆయన వ్యాఖ్యానించారు.

 

1963లో ఇస్రో ప్రస్థానం ప్రారంభమైనప్పుడు, అభివృద్ధి చెందిన దేశాల కన్నా భారత్ సాంకేతికంగా వెనుకబడి ఉండేది. ఆ ఏడాది నవంబర్ 21న అమెరికా అందించిన చిన్న రాకెట్ ప్రయోగంతోనే భారత అంతరిక్ష కార్యక్రమానికి బీజం పడింది. ఆ తర్వాత 1975లో కూడా అమెరికా శాటిలైట్ డేటా సహాయంతోనే ఇస్రో దేశంలోని 2,400 గ్రామాల్లో టెలివిజన్ల ద్వారా ‘మాస్ కమ్యూనికేషన్’ ప్రయోగాన్ని విజయవంతం చేసింది.

 

ఇటీవల జూలై 30న ఇస్రో, నాసా సంయుక్తంగా రూపొందించిన నైసర్ (నాసా-ఇస్రో సింథటిక్ అపెర్చర్ రాడార్) ఉపగ్రహాన్ని జీఎస్‌ఎల్‌వి-ఎఫ్16 రాకెట్ ద్వారా విజయవంతంగా ప్రయోగించిన విషయం తెలిసిందే. ఈ మిషన్ కచ్చితత్వంపై నాసా శాస్త్రవేత్తలు సైతం ఇస్రో పనితీరును ప్రశంసించారు. “ఈ విజయంతో మనం అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలిచాం” అని నారాయణన్ పేర్కొన్నారు.

 

ఒకప్పుడు శాటిలైట్ టెక్నాలజీ లేని స్థాయి నుంచి, గడిచిన 50 ఏళ్లలో ఇస్రో అప్రతిహత ప్రగతిని సాధించింది. ఇప్పటివరకు 34 దేశాలకు చెందిన 433 ఉపగ్రహాలను తన సొంత రాకెట్ల ద్వారా విజయవంతంగా ప్రయోగించి, ప్రపంచ అంతరిక్ష వాణిజ్యంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

ANN TOP 10