AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జడ్పీటీసీ ఉప ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు..! ఎన్నికలు అనడానికే సిగ్గుగా ఉందంటూ వాఖ్యలు..!

ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాస్వామ్య విరుద్ధంగా, అరాచకంగా వ్యవహరిస్తున్నారని, కుట్రలు, దాడులు, అబద్ధాలతో అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తున్నారని వైసీపీ అధినేత జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉపఎన్నికల నేపథ్యంలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, ఎన్నికలను హైజాక్ చేసేందుకు చంద్రబాబు కుట్ర పన్నుతున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ గూండాలు, కొందరు అధికారులు, పోలీసులు కలిసి ఈ కుట్రను అమలు చేస్తున్నారని విమర్శించారు.

 

చంద్రబాబు కుట్రపూరిత ప్రణాళికలను అమలు చేస్తున్నారని మండపడ్డారు. “ఉపఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచే పోలీసులు దౌర్జన్యాలు మొదలుపెట్టారు. గతంలో ఎలాంటి కేసులు లేని వారిపై కూడా బైండోవర్ కేసులు పెట్టి వైసీపీ శ్రేణులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు” అని ఆరోపించారు.

 

ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న తమ పార్టీ నేతలే లక్ష్యంగా టీడీపీ గ్యాంగులు దాడులకు తెగబడుతున్నాయని జగన్ ఆరోపించారు. ఆగస్టు 6న ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, నేత వేల్పుల రామలింగారెడ్డిపై హత్యాయత్నం జరిగిందని, వారి కారును ధ్వంసం చేసి నిప్పంటించే ప్రయత్నం కూడా చేశారని తెలిపారు. ఈ దాడుల సమయంలో పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని విమర్శించారు. వైసీపీ తరఫున పనిచేస్తే ఇలాంటి దాడులే ఎదురవుతాయని భయపెట్టడానికే ఈ దారుణాలకు పాల్పడ్డారని అన్నారు.

 

దాడి చేసిన వారిని అరెస్టు చేయకుండా, బాధితులైన వేల్పుల రాముతో పాటు మరో 50 మందిపై ఆగస్టు 6న మధ్యాహ్నం 3:30 గంటలకు తప్పుడు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారని జగన్ ఆరోపించారు. “ఆగస్టు 8న మా పార్టీ నేతను బెదిరించి, ప్రలోభపెట్టి ఫిర్యాదు తీసుకుని రాఘవరెడ్డి, గంగాధర్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వంటి వారికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. అదే రోజున పులివెందులలో వైసీపీకి ఓట్లు వేసే సుమారు 4,000 మంది ఓటర్లను ఇబ్బంది పెట్టేందుకు, పోలింగ్ బూత్‌లను గ్రామాలకు 2 నుంచి 4 కిలోమీటర్ల దూరానికి మార్చారు. బూత్ కబ్జా, రిగ్గింగ్‌కు ఆస్కారం కల్పించారు” అని ఆయన విమర్శించారు.

 

పోలింగ్ రోజున మీడియా కవరేజీని నియంత్రించి, తమ దాడులు, దౌర్జన్యాలు బయటకు రాకుండా చూడాలని టీడీపీ ప్లాన్ చేస్తోందని జగన్ అన్నారు. “నిజం చెప్పాలంటే వీటిని ఎన్నికలు అనడానికే సిగ్గుగా ఉంది. అయినా నాకు దేవుడిపై, ప్రజలపై నమ్మకం ఉంది. అంతిమంగా ధర్మమే గెలుస్తుంది” అని జగన్ విశ్వాసం వ్యక్తం చేశారు.

ANN TOP 10