అంతర్జాతీయ రాజకీయాల్లో తనదైన శైలితో ప్రత్యర్థులకు చుక్కలు చూపే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, తాజాగా అమెరికాను ఇరుకునపెట్టేలా సంచలన ఎత్తుగడ వేశారు. అమెరికా గూఢచార సంస్థ సీఐఏ డిప్యూటీ డైరెక్టర్‌నే లక్ష్యంగా చేసుకుని ఆయన ఆడిన మైండ్‌గేమ్‌తో వాషింగ్టన్ వర్గాలు దిగ్భ్రాంతికి గురయ్యాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరఫున ప్రత్యేక దూతగా క్రెమ్లిన్‌కు వచ్చిన స్టీవ్ విట్కాఫ్‌తో సమావేశమైన పుతిన్, ఓ అనూహ్య బహుమతిని ఆయన చేతికి అందించి కలకలం రేపారు.
అమెరికా గూఢచార సంస్థ సీఐఏ డిప్యూటీ డైరెక్టర్ జూలియన్ గల్లినా కుమారుడైన మైఖెల్ గ్లోస్‌కు ‘ఆర్డర్ ఆఫ్ లెనిన్’ పతకాన్ని బహూకరిస్తున్నట్లు పుతిన్ ప్రకటించారు. ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యా తరఫున పోరాడుతూ మైఖెల్ వీరమరణం పొందాడని, ఆయన ధైర్యసాహసాలకు గుర్తుగా ఈ పతకాన్ని అందజేస్తున్నామని తెలిపారు. ఈ పతకాన్ని జూలియన్‌కు చేరవేయాలని విట్కాఫ్‌ను పుతిన్ కోరారు. ఈ చర్యతో అమెరికా గూఢచార వర్గాల్లోనే అనుమానాలు రేకెత్తించాలని, అమెరికాను ఆత్మరక్షణలోకి నెట్టాలని పుతిన్ ప్రయత్నించినట్లు స్పష్టమవుతోంది. ఈ సంఘటన వెనుక పుతిన్ ఉద్దేశం అమెరికా సీఐఏ ఉన్నతాధికారిణి కుమారుడు రష్యా పక్షాన యుద్ధంలో పాల్గొన్నాడనే ప్రశ్నలను లేవనెత్తడమేనని నిపుణులు అనుమానిస్తున్నారు
మైఖెల్ గ్లోస్ గతంలో సోషల్ మీడియాలో రష్యాకు మద్దతుగా పోస్టులు పెట్టాడని, మాస్కోలో ఉన్న చిత్రాలు కూడా బయటకు వచ్చాయని సమాచారం. అతడు 2024 ఏప్రిల్‌లో తూర్పు ఐరోపాలో మరణించినట్లు వార్తలొచ్చాయి. మైఖెల్ మృతదేహం అమెరికాకు చేరిన తర్వాత, 2025 ఏప్రిల్‌లో సీఐఏ ఓ ప్రకటన విడుదల చేసింది. మైఖెల్ మరణానికి, జాతీయ భద్రతకు ఎలాంటి సంబంధం లేదని, అతడు కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని ఆ ప్రకటనలో పేర్కొంది.
పుతిన్ ఇచ్చిన పతకాన్ని విట్కాఫ్ స్వీకరించారా లేదా అనే దానిపై స్పష్టత లేదు. ఈ ఘటనపై అటు రష్యా గానీ, ఇటు అమెరికా, సీఐఏ లేదా విట్కాఫ్ వర్గాలు గానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. కేవలం అమెరికాను రెచ్చగొట్టేందుకే పుతిన్ ఈ చర్యకు పాల్పడ్డారని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.