AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ట్రంప్ టారిఫ్ ల దెబ్బకు ధరలు పెరిగాయంటూ అమెరికన్ల ఫైర్..!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై విధిస్తున్న సుంకాల ప్రభావం ఆ దేశ ప్రజలపైనా పడుతోంది. విదేశాలపై సుంకాల ప్రభావంతో అమెరికాలో నిత్యావసర వస్తువులు, దుస్తుల ధరలు పెరిగాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. సుంకాలకు ముందు, తర్వాత ధరల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ ఎన్నికల స్లోగన్ ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ ను గుర్తుచేస్తూ.. నిజంగానే మనం గ్రేట్ అవుతున్నామా అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు సంధిస్తున్నారు. తాజాగా మెర్సిడెస్ ఛాండ్లర్ అనే మహిళ ఇన్ స్టాలో ఓ వీడియో పోస్టు చేస్తూ ట్రంప్ సుంకాల ప్రభావాన్ని వివరించింది. తాను రెగ్యులర్ గా వెళ్లే వాల్ మార్ట్ లో ట్రంప్ సుంకాల ఎఫెక్ట్ భారీగా కనిపిస్తోందని, అన్ని వస్తువుల ధరలు పెరిగాయని ఆరోపించింది.

 

చిన్న పిల్లల దుస్తులు చూపిస్తూ.. ‘‘గతంలో ఈ డ్రెస్ ధర 6 డాలర్ల 98 సెంట్లు ఉండేది. ఇప్పుడు ఇదే డ్రెస్ ధర 10 డాలర్ల 98 సెంట్లకు పెరిగింది. 10.98 డాలర్లుగా ఉన్న మరో డ్రెస్ ధర సుంకాల ప్రభావంతో 11.98 డాలర్లకు చేరింది. బ్యాక్ పాక్ (బ్యాగు) ధర గతంలో 19.97 డాలర్లు కాగా ప్రస్తుతం 24.97 డాలర్లకు చేరింది. సగటున ప్రతీ వస్తువు ధర 4 డాలర్లకు పైనే పెరిగింది. ఆయా వస్తువులకు ఉన్న ప్రైస్ ట్యాగ్ కింద పాత ధరను మీరు స్పష్టంగా చూడొచ్చు. కొన్ని వస్తువుల ట్యాగ్ లపై కొత్తగా స్టిక్కర్ అతికించారు. మీకు నమ్మకం కలగకపోతే దగ్గర్లోని వాల్ మార్ట్ కానీ టార్గెట్ కానీ వెళ్లి చూడండి” అని ఛాండ్లర్ చెప్పారు. ఈ వీడియో వైరల్ గా మారడంతో నెటిజన్లు వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. సుంకాల ద్వారా అమెరికాపై డాలర్ల వర్షం కురుస్తోందని ట్రంప్ అంటున్నారు, అయినా మనం కొనే దుస్తులపై అదనంగా మరో డాలర్ చెల్లించాల్సి వస్తోందని విమర్శిస్తున్నారు.

ANN TOP 10