యుద్దం ఆగడం ఇష్టం లేని దేశాలు అంతరాయం కల్గించే ప్రయత్నాలు చేస్తున్నాయన్న రష్యా
15న అమెరికా, రష్యా అధ్యక్షులు కీలక భేటీ
పుతిన్, ట్రంప్‌ల భేటీని ధ్రువీకరించిన క్రెమ్లిన్
రష్యా – ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దిశగా తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భాగంగా ఈ నెల 15న అమెరికాలోని అలాస్కాలో దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల భేటీ జరగనుంది. ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్ ద్వారా వెల్లడించారు.
ఈ క్రమంలో స్పందించిన రష్యా.. వీరి భేటీకి అంతరాయం కలిగించేందుకు కొన్ని దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని పేర్కొంది. దీని కోసం రెచ్చగొట్టే ప్రకటనలు, తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తున్నాయని రష్యా ఆరోపించింది.
యుద్ధం ఆగడం ఇష్టం లేని దేశాలు పుతిన్ – ట్రంప్ సమావేశానికి అంతరాయం కలిగించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయనడంలో సందేహం లేదని రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్టిమెంట్ ఫండ్ సీఈవో కిరిల్ దిమిత్రివ్ పేర్కొన్నారు. కొన్ని దేశాలు రెచ్చగొట్టే ప్రకటనలు, తప్పుడు సమాచారం వ్యాప్తికి పాల్పడుతున్నాయని అన్నారు. అయితే, ఏయే దేశాలు, ఎటువంటి ప్రకటనలు చేస్తున్నాయి అనే దానిపై ఆయన క్లారిటీ ఇవ్వలేదు.
మరోవైపు పుతిన్, ట్రంప్‌ల భేటీని క్రెమ్లిన్ (పుతిన్ అధికారిక నివాసం) కూడా ధ్రువీకరించింది. దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఉక్రెయిన్ సంక్షోభానికి శాంతియుత పరిష్కారంపై దృష్టి సారించామని తెలిపింది.