AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఈసీ చేతిలో ప్రజాస్వామ్యం ఖూనీ… మోదీ కోసమే..! రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు..

కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ)పై కాంగ్రెస్ అగ్ర నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ఈసీ ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే సంస్థగా కాకుండా, దాన్ని ఓ క్రమపద్ధతిలో కూల్చివేయడానికి సహకరిస్తోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. బీజేపీతో ఈసీ కుమ్మక్కై ఎన్నికల ప్రక్రియను పూర్తిగా తారుమారు చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ధ్వజమెత్తారు.

 

ఎన్నికల ప్రక్రియ, ఓటర్ల జాబితా విశ్వసనీయతపై ఆయన తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశారు. “అసలు ఓటర్ల జాబితా కచ్చితంగా ఉందా? సరైన వ్యక్తులు ఓటు వేయగలుగుతున్నారా? ప్రజల్లో తీవ్రమైన అనుమానాలు ఉన్నాయి, వాటికి బలమైన కారణాలు కూడా ఉన్నాయి” అని రాహుల్ అన్నారు. మహారాష్ట్రలో లోక్‌సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల మధ్య కేవలం ఐదు నెలల వ్యవధిలో ఏకంగా కోటి మంది కొత్త ఓటర్లు ఎలా పెరిగారని ఆయన ప్రశ్నించారు. “లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో మేము ఘన విజయం సాధించాం. కానీ కొన్ని నెలల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోయాం. ఈ మధ్యలో కోటి మంది కొత్త ఓటర్లు పుట్టుకొచ్చారు. దీనిపై వివరణ ఇవ్వాలని ఈసీని కోరినా వారి నుంచి సమాధానం లేదు” అని ఆయన పేర్కొన్నారు.

 

అంతేకాకుండా, హర్యానా, మధ్యప్రదేశ్‌లలో ఒపీనియన్ పోల్స్‌కు, తమ అంతర్గత సర్వేలకు, వాస్తవ ఫలితాలకు మధ్య భారీ వ్యత్యాసం ఉందని, ఫలితాలను ముందుగానే నిర్దేశించినట్లుగా ఉందని రాహుల్ ఆరోపించారు. మహారాష్ట్రలో పోలింగ్ కేంద్రాల వద్ద పెద్దగా క్యూలు లేనప్పటికీ, సాయంత్రం 5 గంటల తర్వాత పోలింగ్ శాతం అమాంతం పెరిగిపోవడం వెనుక ఆంతర్యమేమిటని నిలదీశారు.

 

విశ్లేషణ కోసం ఓటర్ల జాబితా సాఫ్ట్ కాపీలను ఈసీ ఉద్దేశపూర్వకంగా నిరాకరిస్తోందని, సీసీటీవీ ఫుటేజ్‌ను ధ్వంసం చేస్తోందని రాహుల్ ఆరోపించారు. “ప్రధాని మోదీ కేవలం 25 సీట్ల మెజారిటీతో ఉన్న ప్రధాని. ఆయన అధికారంలో కొనసాగాలంటే 25 సీట్లను దొంగిలిస్తే సరిపోతుంది. అందుకే ఎన్నికల సంఘం నిజాలను కప్పిపుచ్చుతోంది” అని రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ANN TOP 10