ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయే) కీలక నిర్ణయం తీసుకుంది. తమ కూటమి తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసే పూర్తి అధికారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలకు అప్పగిస్తూ గురువారం నాడు ఏకగ్రీవంగా తీర్మానించింది.
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ ఫ్లోర్ లీడర్ల సమావేశం జరిగింది. ఈ భేటీకి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రాజ్యసభాపక్ష నేత, కేంద్ర మంత్రి జేపీ నడ్డా సహా పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు. సమావేశం అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు వివరాలను మీడియాకు వెల్లడించారు. “రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అన్ని మిత్రపక్షాల నేతలు పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిని నిర్ణయించే బాధ్యతను ప్రధాని మోదీ, జేపీ నడ్డాలకు అప్పగించాలని ఏకగ్రీవంగా నిర్ణయించాం. వారు తీసుకునే నిర్ణయానికి ఎన్డీయేలోని భాగస్వామ్య పక్షాలన్నీ కట్టుబడి ఉంటాయి,” అని ఆయన స్పష్టం చేశారు.
ఆరోగ్య కారణాలను చూపుతూ జగ్‌దీప్ ధన్‌ఖడ్ జులై 21న అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేయడంతో ఉపరాష్ట్రపతి స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. “ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ, వైద్యుల సలహా మేరకు నేను భారత ఉపరాష్ట్రపతి పదవికి తక్షణమే రాజీనామా చేస్తున్నాను,” అని తన రాజీనామా లేఖలో ధన్‌ఖడ్ పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం ఇప్పటికే ఉపరాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల చేసింది. గురువారం నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఆగస్టు 21 నామినేషన్లకు చివరి తేదీ కాగా, సెప్టెంబర్ 9న పోలింగ్, ఓట్ల లెక్కింపు జరగనుంది. పార్లమెంట్ ఉభయ సభల సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీలో ఎన్డీయేకు స్పష్టమైన మెజారిటీ ఉన్నందున, కూటమి బలపరిచిన అభ్యర్థి విజయం లాంఛనమే కానుంది. జేడీ(యూ), శివసేన, అప్నా దళ్ సహా పలు మిత్రపక్షాలు ఇప్పటికే ఉపరాష్ట్రపతి ఎన్నికలో బీజేపీకి బేషరతు మద్దతు ప్రకటించాయి.