నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా, ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్’. దసరా బ్లాక్బస్టర్ విజయం తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా కావడంతో దీనిపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ అంచనాలకు మరింత ఊపునిస్తూ, చిత్ర ప్రచారంలో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఒక సరికొత్త పంథాను పరిచయం చేశారు. ఇకపై ఈ సినిమాలోని ప్రతి పాత్రను రెండు వేర్వేరు పోస్టర్ల ద్వారా పరిచయం చేయనున్నట్టు ఆయన ప్రకటించారు.
ఈ మేరకు గురువారం నాడు తన ఎక్స్ ఖాతాలో ఓదెల ఓ పోస్ట్ చేశారు. ” రెండు పోస్టర్లు విడుదల చేస్తున్నాం. ఉదయం 10:05 గంటలకు నేను పాత్రను ఎలా ఊహించుకున్నానో చూపిస్తాం. సాయంత్రం 5:05 గంటలకు ఆయన ఎలా మారిపోయారో చూపిస్తాం. ఆయన యాటిట్యూడ్, మా ప్రామిస్ రెండూ కనిపిస్తాయి. మీ ప్రేమ, మా పిచ్చితో మేం వస్తున్నాం” అని పేర్కొన్నారు. ఈ సినిమాలోని ప్రతి పాత్ర పరిచయానికి ఇదే విధానాన్ని అనుసరిస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రకటనతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.
ప్రస్తుతం ‘ది ప్యారడైజ్’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఫైట్ మాస్టర్ రియల్ సతీశ్ నేతృత్వంలో ఓ భారీ యాక్షన్ ఘట్టాన్ని చిత్రీకరించారు. ఈ సన్నివేశం కోసం విదేశీ స్టంట్ మాస్టర్లు కూడా పనిచేశారని, ఇది సినిమాలో ఓ హైలైట్గా నిలుస్తుందని చిత్ర యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. నాని కెరీర్లోనే అత్యంత భారీగా ఈ చిత్రాన్ని ఎస్ఎల్వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.
ప్రముఖ హిందీ నటుడు రాఘవ్ జుయల్ ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లిష్, స్పానిష్ భాషలతో కలిపి మొత్తం 8 భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 26న ‘ది ప్యారడైజ్’ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.