AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రాహుల్ గాంధీ ఆరోపణలు.. ప్రమాణం చేసి ఫిర్యాదు చేయాలన్న ఈసీ..

లోక్‌సభ ఎన్నికల్లో ‘ఓట్ల దొంగతనం’ జరిగిందంటూ లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీవ్రంగా స్పందించింది. రాహుల్ వ్యాఖ్యలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని, ఆయన తన ఆరోపణలపై నమ్మకం ఉంటే ప్రమాణపూర్వకంగా ఫిర్యాదు చేయాలని గురువారం స్పష్టం చేసింది. ఈ మేరకు ‘ఫ్యాక్ట్ చెక్’ పేరుతో ఒక ప్రకటన విడుదల చేసింది.

 

“మీరు చెప్పేది నిజమే అయితే, ఈ సాయంత్రంలోగా కర్ణాటక ఎన్నికల అధికారికి ప్రమాణ స్వీకార పత్రం సమర్పించాలి. తద్వారా అవసరమైన చర్యలు తీసుకుంటాం. ఒకవేళ మీ ఆరోపణలపై మీకే నమ్మకం లేకపోతే, అర్థరహితమైన అభిప్రాయాలకు రావడం, ప్రజలను తప్పుదోవ పట్టించడం మానుకోవాలి” అని ఈసీ రాహుల్‌కు హితవు పలికింది.

 

అంతకుముందు, 2024 లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలోని బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని మహదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్‌లో భారీ ఎత్తున ఎన్నికల మోసం జరిగిందని రాహుల్ ఆరోపించారు. దేశవ్యాప్తంగా ఇలాంటి అవకతవకలు జరుగుతున్నాయని అన్నారు. బెంగళూరు సెంట్రల్‌లో బీజేపీకి 32,707 ఓట్ల ఆధిక్యం రాగా, ఒక్క మహదేవపురలోనే ఆ పార్టీకి 1,14,046 ఓట్ల భారీ ఆధిక్యం ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఈ ఒక్క సెగ్మెంట్‌లోనే దాదాపు 1,00,250 ఓట్లను దొంగిలించారని, బీజేపీతో కుమ్మక్కై ఈసీయే ఈ మోసానికి పాల్పడిందని ఆయన ఆరోపించారు. డూప్లికేట్ ఓటర్లు, ఇతర రాష్ట్రాల్లోనూ ఓట్లు ఉన్నవారి పేర్లను ఆయన ఉదహరించారు.

 

రాహుల్ వ్యాఖ్యలపై కేంద్రం ఆగ్రహం

 

రాహుల్ గాంధీ ఆరోపణలను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తీవ్రంగా ఖండించారు. రాహుల్, ఆయన బృందం చేస్తున్న వాదనలు నిరాధారమైనవని, రాజకీయ ప్రేరేపితమైనవని విమర్శించారు. ఎన్నికల సంఘం ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తమకు అనుకూలంగా తీర్పులు రానప్పుడు సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగ సంస్థలను కించపరచడం కాంగ్రెస్‌కు అలవాటుగా మారిందని ఆయన అన్నారు. ఓటర్ల జాబితా సవరణ అనేది స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి జరుగుతున్న ప్రక్రియేనని, ఇందులో కొత్తగా చేస్తోంది ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు.

ANN TOP 10