AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

లైంగిక స‌మ్మ‌తి వయసు పై కేంద్రం స్పష్టీకరణ..!

లైంగిక కార్యకలాపాలకు చట్టపరమైన అంగీకార వయసును 18 ఏళ్ల నుంచి తగ్గించే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తేల్చి చెప్పింది. కౌమార దశలో ఉండే ప్రేమ వ్యవహారాలను కారణంగా చూపి, ఈ వయసును తగ్గించాలన్న వాదనలను తీవ్రంగా వ్యతిరేకించింది. మైనర్ల రక్షణే ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమని, ఈ విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేసింది. ఈ వ‌యోప‌రిమితిని 18 నుంచి 16 ఏళ్ల‌కు త‌గ్గించాలంటూ సీనియ‌ర్ న్యావాది ఇందిరా జైన్‌సింగ్ చేసిన వాద‌న‌కు స్పంద‌న‌గా ప్ర‌భుత్వం ఈ విష‌యాన్ని కోర్టుకు తెలిపింది.

 

మైనర్లను లైంగిక వేధింపుల నుంచి కాపాడేందుకు 18 ఏళ్ల వయోపరిమితి చాలా కీలకమని ప్రభుత్వం తన వాదనలో పేర్కొంది. ఈ నిబంధనను కఠినంగా, దేశవ్యాప్తంగా ఒకేలా అమలు చేయాలని నొక్కి చెప్పింది. ఒకవేళ ఈ వయసును తగ్గిస్తే, బాలల పరిరక్షణ కోసం దశాబ్దాలుగా చేసిన కృషి నీరుగారిపోతుందని, ‘పోక్సో’ (లైంగిక నేరాల నుంచి బాలల పరిరక్షణ చట్టం) వంటి కఠిన చట్టాలు బలహీనపడతాయని ఆందోళన వ్యక్తం చేసింది. 18 ఏళ్ల లోపు వారికి లైంగిక అంగీకారంపై సరైన అవగాహన, పరిణతి ఉండవని, వయసు తగ్గింపు వారి సంక్షేమానికి పెను ముప్పుగా మారుతుందని కేంద్రం వివరించింది.

 

యువ‌తి యువ‌కుల మ‌ధ్య శృంగార భ‌రిత ప్రేమ పేరుతో ఈ వ‌యోప‌రిమితిని స‌వ‌రించ‌డం చ‌ట్ట‌వ్య‌తిరేక‌మే కాక ప్ర‌మాద‌క‌రం కూడా అని అద‌న‌పు సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ ఐశ్వ‌ర్య భాటి లిఖిత‌పూర్వ‌కంగా తెలియ‌జేశారు. కౌమార వయసులో ఉన్నవారి మధ్య ఇష్టపూర్వక సంబంధాలను కూడా ప్రస్తుత చట్టం నేరంగా పరిగణిస్తోందన్న వాదనలపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ స్పష్టత ఇచ్చింది.

 

టీనేజ్ ప్రేమ వ్యవహారాల వల్ల యువకులు క్రిమినల్ కేసులు ఎదుర్కోవాల్సి వస్తోందని, దీనివల్ల సామాజికంగా నష్టం జరుగుతోందని మార్పును కోరుతున్న వారు వాదిస్తున్నారు. అయితే, ప్రేమ పేరుతో బాల్య వివాహాలను ప్రోత్సహించే ప్రమాదం ఉందని, వయసు తగ్గింపును దుర్వినియోగం చేసే అవకాశం ఉందని ప్రభుత్వ ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు.

ANN TOP 10