అమెరికాలో గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుని సంవత్సరాలుగా వేచి చూస్తున్న వారికి ఊరట కల్పించేందుకు అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. నిర్ణీత మొత్తం చెల్లిస్తే దరఖాస్తును త్వరగా పరిశీలించే అవకాశం తీసుకురానుంది. ఇందుకు అనుగుణంగా పలు ప్రతిపాదనలతో బిల్లును సిద్ధం చేసిన ప్రభుత్వం.. త్వరలో చట్టసభల్లో ప్రవేశపెట్టనుంది.
అమెరికాలో తాత్కాలిక వీసాలపై ఉంటున్న భారతీయులతో పాటు చైనా, మెక్సికో, ఫిలిప్పీన్స్ పౌరులు గ్రీన్ కార్డు కోసం సంవత్సరాల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. ఆయా దేశాల నుంచి పెద్ద సంఖ్యలో వలసలు, ఏటా నిర్ణయించే కోటా తదితర కారణాలతో ఈ ఆలస్యం జరుగుతోంది.
డిగ్నిటీ యాక్ట్ ఆఫ్ 2025 బిల్లులో ఏముందంటే..
దశాబ్దాలుగా నలుగుతోన్న సమస్యకు పరిష్కారం చూపేందుకు ఈ బిల్లును ప్రవేశపెట్టామని సెనేటర్ మారియా ఎల్విరా సలజార్ పేర్కొన్నారు. గ్రీన్ కార్డ్ బ్యాక్ లాగ్లను క్లియర్ చేయడమే లక్ష్యంగా ప్రీమియం ప్రాసెసింగ్ ఫీ విధానం తీసుకొస్తామని వివరించారు. పదేళ్లుగా గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్నవారు ప్రీమియం ప్రాసెసింగ్ ఫీ (20 వేల డాలర్లు) చెల్లిస్తే అధికారులు వారి దరఖాస్తును త్వరగా పరిశీలిస్తారని చెప్పారు.
ఏటా ఏ కోటాలో ఎన్ని కార్డులంటే..?
తాత్కాలిక వీసాలపై అమెరికాలో ఉంటూ శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకునే వారికి ప్రభుత్వం గ్రీన్ కార్డులు జారీ చేస్తుంది. ఫ్యామిలీ ప్రిఫరెన్స్ కోటాలో 2,26,000 గ్రీన్ కార్డులు, ఉపాధి ఆధారిత కేటగిరీలో 1,40,000 గ్రీన్ కార్డులను ఏటా జారీ చేస్తారు. అయితే, ఒక్కో దేశానికి నిర్ణీత సంఖ్య (కోటా)లో మాత్రమే వీటిని జారీ చేస్తుంటారు. మొత్తం దరఖాస్తుల్లో ఒక్కో దేశానికి కేవలం 7% మాత్రమే కేటాయించాలన్నది ప్రస్తుత విధానం. తాజా బిల్లులో దీనిని 15 శాతానికి పెంచాలని ప్రతిపాదించారు.