నాణ్యమైన వైద్య సేవలకు భారతదేశం ప్రపంచస్థాయి చిరునామాగా మారుతోంది. వైద్యం కోసం మన దేశానికి వస్తున్న విదేశీ పర్యాటకుల సంఖ్య ఏటా గణనీయంగా పెరుగుతోంది. ఈ ఏడాది మొదటి నాలుగు నెలల్లోనే (ఏప్రిల్ వరకు) 1,31,856 మంది విదేశీయులు వైద్య చికిత్సల నిమిత్తం భారత్‌ను సందర్శించారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గురువారం నాడు పార్లమెంటుకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
ఈ ఏడాది దేశానికి వచ్చిన మొత్తం విదేశీ పర్యాటకుల్లో మెడికల్ టూరిస్టుల వాటా సుమారు 4.1 శాతంగా ఉందని మంత్రి వివరించారు. గత ఐదేళ్లుగా వైద్య పర్యాటకుల సంఖ్య స్థిరంగా పెరుగుతోందని తెలిపారు. 2020లో 1.8 లక్షలుగా ఉన్న ఈ సంఖ్య, 2024 నాటికి 6.4 లక్షలకు చేరిందని పేర్కొన్నారు. అయితే 2023లో వచ్చిన 6.5 లక్షల మందితో పోలిస్తే 2024లో స్వల్ప తగ్గుదల కనిపించింది. బంగ్లాదేశ్, ఇరాక్, సోమాలియా, ఒమాన్, ఉజ్బెకిస్థాన్ వంటి దేశాల నుంచి అత్యధికంగా వైద్యం కోసం భారత్‌కు వస్తున్నారని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
దేశంలో మెడికల్ టూరిజాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో ‘హీల్ ఇన్ ఇండియా’ అనే ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా ఆసుపత్రులు, వాణిజ్య సంఘాలతో కలిసి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కృషి చేస్తోందని మంత్రి షెకావత్ తెలిపారు. విదేశీయులు సులభంగా వైద్యం కోసం రాగలిగేలా వీసా విధానాలను సరళీకరించినట్లు చెప్పారు. ప్రస్తుతం 171 దేశాల పౌరులకు ఈ-మెడికల్ వీసా, ఈ-మెడికల్ అటెండెంట్ వీసా సౌకర్యాన్ని అందిస్తున్నామన్నారు.
ప్రస్తుతం భారతదేశంలో మెడికల్ టూరిజం మార్కెట్ విలువ సుమారు 9 బిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నారు. గ్లోబల్ మెడికల్ టూరిజం సూచీలో భారత్ 10వ స్థానంలో నిలిచింది. ముఖ్యంగా ఆయుష్ (ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి) వైద్య విధానాలకు ఆదరణ పెరగడంతో ఈ రంగం మరింత వృద్ధి చెందుతోంది. జూలై 2023 నుంచి డిసెంబర్ 2024 మధ్య కాలంలో 123 రెగ్యులర్ ఆయుష్ వీసాలు, 221 ఈ-ఆయుష్ వీసాలు జారీ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.