రోడ్డుపై బస్సు ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఏసీ బస్సులో మంటలు చెలరేగాయి. బస్సులో మంటలు ఎగిసిపడుతూ దట్టమైన పొగలు వ్యాపించాయి.
మంటలు, పొగలను చూసి బస్సు డ్రైవర్ వెంటనే అప్రమత్తమయ్యాడు. బస్సును ఆపేయడంతో ప్రమాదం తప్పింది. మంటలు వచ్చినప్పుడు బస్సులో ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. మంటలను గమనించి డ్రైవర్ బస్సును ఆపేసి ప్రయాణికులను కిందకు దింపేశారు. దీంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. దట్టమైన పొగలు వ్యాపించడంతో రోడ్డుపై వెళుతున్న వాహనదారులు ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురయ్యాడు. ఏసీ బస్సు బేగంపేట్లో ఉన్నప్పుడు ఈ అగ్నిప్రమాదం సంభవించింది.
తెలంగాణ ఆర్టీసీకి చెందిన ఈ ఎలక్ట్రిక్ ఎయిర్పోర్ట్ బస్సు శంషాబాద్ నుంచి జేబీఎస్ వెళుతుండగా బేగంపేట దగ్గర అగ్నిప్రమాదం జరిగింది. బస్సు పైభాగంలోని ఏసీ నుంచి ఒక్కసారిగా మంటలు బయటకు వచ్చాయి. దీంతో డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించాడు. మంటలను గమనించి బస్సును రోడ్డు పక్కకు ఆపేయడంతో పెను ప్రమాదం తప్పనట్లైంది. ఆర్టీసీ డ్రైవర్ వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించాడు.
అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఫైరింజన్ సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఏసీలో షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్నిప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. అగ్నిప్రమాదంతో ప్రయాణికులను వేరే బస్సులో గమ్యస్థానానికి చేర్చినట్లు తెలుస్తోంది. అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు మరింతగా ఆరా తీస్తున్నారు. త్వరలో అగ్నిప్రమాదానికి గల అసలు కారణాలు బయటపడనున్నాయి.