AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకుంటోంది..: మంత్రి లోకేష్..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకుంటోందని, దీనికి నిదర్శనంగా జూలై నెలలో జీఎస్టీ వసూళ్లు సరికొత్త రికార్డు సృష్టించాయని రాష్ట్ర ఐటీ, విద్య, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. మంగళవారం ఆయన సోషల్ మీడియా వేదికగా ఈ వివరాలను వెల్లడించారు.

 

రాష్ట్రంలో 2017లో జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ ఎన్నడూ లేనంతగా 2025 జూలై నెలలో రూ.3,803 కోట్లు వసూలైనట్లు లోకేశ్ పేర్కొన్నారు. గత ఏడాదితో పోలిస్తే ఇది 14 శాతం అధికమని ఆయన వివరించారు. ఈ వృద్ధి రేటు దక్షిణాది రాష్ట్రాల్లోనే అత్యధికమని, దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో మూడో స్థానంలో నిలిచిందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. “ఆంధ్రప్రదేశ్ మళ్లీ పుంజుకుంది, ఇది ఆరంభం మాత్రమే” అని ఆయన తన ఎక్స్ ఖాతాలో వ్యాఖ్యానించారు.

 

ఇదిలా ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కీలక అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా విజయవాడలో బుధవారం ‘ఎంపవరింగ్ ఇండియాస్ గ్రీన్ ఫ్యూచర్’ పేరుతో గ్రీన్ స్కిల్లింగ్ సదస్సును నిర్వహించనుంది. దేశంలోనే అతిపెద్ద గ్రీన్ స్కిల్లింగ్ కార్యక్రమంగా దీన్ని అభివర్ణిస్తున్నారు.

 

ఈ సదస్సు ద్వారా సౌర, పవన విద్యుత్ తయారీ, నిర్వహణ వంటి రంగాల్లో వేలాది మంది యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వనున్నారు. స్వనీతి ఇనిషియేటివ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ సదస్సులో మంత్రి నారా లోకేష్, రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌తో పాటు 250 మందికి పైగా పారిశ్రామికవేత్తలు, ఇతర ప్రముఖులు పాల్గొననున్నారు.

ANN TOP 10