భారత ఈ-వీసా సౌకర్యాన్ని ప్రస్తుతం 172 దేశాల పౌరులకు అందిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ-వీసా పొందిన విదేశీయులు దేశంలోని 32 అంతర్జాతీయ విమానాశ్రయాలు, 6 ప్రధాన ఓడరేవుల ద్వారా భారత్‌లోకి ప్రవేశించవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మంగళవారం లోక్‌సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో కీలక వివరాలు వెల్లడించారు.
ప్రస్తుతం మొత్తం 13 సబ్ కేటగిరీల్లో ఈ-వీసాలు జారీ చేస్తున్నట్లు బండి సంజయ్ తెలిపారు. వీటిలో ఈ-టూరిస్ట్, ఈ-బిజినెస్, ఈ-మెడికల్, ఈ-మెడికల్ అటెండెంట్, ఈ-కాన్ఫరెన్స్, ఈ-ఆయుష్, ఈ-ఫిల్మ్, ఈ-స్టూడెంట్ వీసాలు వంటివి ఉన్నాయని పేర్కొన్నారు. పర్యాటకం, పెట్టుబడులు, ద్వైపాక్షిక సంబంధాలు, భద్రతాపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకుని వీసా నిబంధనలను సరళీకృతం చేసే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని ఆయన వివరించారు.
విదేశీ పర్యాటకులను, పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం గత కొన్నేళ్లుగా అనేక చర్యలు చేపట్టిందని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగానే 2014 నవంబర్‌లో 43 దేశాలకు ఈ-వీసా సదుపాయాన్ని ప్రవేశపెట్టామని గుర్తుచేశారు. ఈ-వీసా దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లోనే జరుగుతుందని, విదేశీయులు ఎక్కడి నుంచైనా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.
పర్యాటకులను ప్రోత్సహించే ఉద్దేశంతో 2019లో 30 రోజుల డబుల్ ఎంట్రీ ఈ-టూరిస్ట్ వీసాను 25 డాలర్ల ఫీజుతో ప్రారంభించామని బండి సంజయ్ పేర్కొన్నారు. ముఖ్యంగా ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో (ఆఫ్-సీజన్) పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఈ ఫీజును 10 డాలర్లకు తగ్గించినట్లు ఆయన తెలిపారు. పర్యాటకం, వ్యాపారం, వైద్యం వంటి చట్టబద్ధమైన ప్రయోజనాల కోసం విదేశీయులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భారత్‌కు వచ్చేందుకు ఈ-వీసా విధానం ఎంతగానో దోహదపడుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.