AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కూటమి ప్రభుత్వంలో అవినీతి విచ్చలవిడిగా పేట్రేగింది: జగన్..

ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో అవినీతి విచ్చలవిడిగా పేట్రేగిపోయిందని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యంగా మద్యం వ్యాపారం, అక్రమ ఇసుక తవ్వకాలు, అమరావతి భూముల వ్యవహారాల్లో అవినీతి తారస్థాయికి చేరిందని ఆయన మంగళవారం విమర్శించారు.

 

ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన పార్టీ లీగల్ సెల్ న్యాయవాదుల సమావేశంలో జగన్ మాట్లాడుతూ… రాష్ట్రంలో రాజకీయ కక్ష సాధింపులు ప్రమాదకర స్థాయికి చేరాయని అన్నారు. హైదరాబాద్, బెంగళూరు నగరాలతో పోలిస్తే అమరావతి రాజధాని పనులను రెట్టింపు ధరకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వం యూనిట్ విద్యుత్‌ను రూ. 2.49కి కొనుగోలు ఒప్పందాలు చేస్తే, ప్రస్తుత ప్రభుత్వం రూ. 4.60కి కొనుగోలు చేస్తోందని విమర్శించారు.

 

ప్రభుత్వం సూపర్-6, సూపర్-7 వంటి మోసపూరిత పథకాలతో ప్రజలను మోసం చేసినట్టే, న్యాయవాదులను కూడా వంచిస్తోందని జగన్ అన్నారు. ప్రతి గ్రామంలో బెల్టు షాపులు నడుస్తున్నాయని, పర్మిట్ రూమ్‌లను అక్రమంగా అమ్ముకుంటున్నారని, ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు మద్యం విక్రయిస్తున్నారని ఆరోపించారు. చిన్న పరిశ్రమ పెట్టాలన్నా లంచాలు ఇవ్వాల్సిన దుస్థితి నెలకొందని, కొందరు పోలీసు అధికారులే జూదం క్లబ్‌లకు అండగా నిలుస్తున్నారని జగన్ విమర్శించారు.

 

ప్రస్తుత పరిస్థితుల్లో న్యాయం, ధర్మం కనుమరుగయ్యాయని, ప్రతిపక్షంలో ఉన్నారనే కారణంతో ఎలాంటి ఆధారాలు లేకుండానే వ్యక్తులను జైలుకు పంపుతున్నారని జగన్ అన్నారు. బెదిరింపులతో తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారని, ఇది సిగ్గుచేటైన రాజకీయ సంస్కృతి అని అభివర్ణించారు. అధికార దుర్వినియోగానికి వ్యతిరేకంగా న్యాయవాదులు ముందుండి పోరాడాలని, బాధితులకు అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.

 

త్వరలోనే ఓ కొత్త మొబైల్ యాప్‌ను ప్రారంభించనున్నట్లు జగన్ ప్రకటించారు. ప్రజలు తమకు జరిగిన అన్యాయాలను ఆధారాలతో సహా ఈ యాప్‌లో నమోదు చేయవచ్చని, ఈ సమాచారాన్ని డిజిటల్ లైబ్రరీలో భద్రపరిచి అధికార దుర్వినియోగానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. తమ హయాంలో న్యాయవాదుల సంక్షేమ నిధికి రూ. 100 కోట్లు కేటాయించామని, లా నేస్తం పథకం ద్వారా యువ న్యాయవాదులను ఆదుకున్నామని జగన్ గుర్తుచేశారు. కష్టపడి పనిచేసిన వారికి పార్టీలో తప్పక గుర్తింపు ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.

ANN TOP 10