AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘ఆపరేషన్ సిందూర్’ దెబ్బకు ప్రాణభయంతో మసూద్ అజహర్ రహస్య స్థావరాలకు తరలిస్తున్న పాక్..

భారత సైన్యం జరిపిన ‘ఆపరేషన్ సిందూర్’, ‘ఆపరేషన్ మహాదేవ్’ వంటి కీలక దాడులతో ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ (జేఈఎం) తీవ్రంగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో, సంస్థ చీఫ్, మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ మసూద్ అజహర్ ప్రాణభయంతో అజ్ఞాతంలోకి వెళ్లినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. అతడిని భారత ఏజెన్సీల నుంచి కాపాడేందుకు పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ తీవ్రంగా శ్రమిస్తోంది. ఇందులో భాగంగా అజహర్ మకామును ఎప్పటికప్పుడు మారుస్తూ అత్యంత రహస్యంగా ఉంచుతోంది.

 

‘ఆపరేషన్ సిందూర్’ జైషే మహ్మద్ సంస్థను కోలుకోలేని దెబ్బతీసింది. ఈ ఆపరేషన్‌లో వంద మందికి పైగా ఉగ్రవాదులు హతమవడమే కాకుండా, బహవల్పూర్‌లోని జేఈఎం ప్రధాన కార్యాలయం పూర్తిగా ధ్వంసమైంది. అత్యంత ముఖ్యంగా, ఈ దాడిలో మసూద్ అజహర్ సోదరుడు రవూఫ్ అస్ఘర్‌తో సహా అతడి కుటుంబ సభ్యులు 10 మంది మరణించారు. ఈ పరిణామాలతో జైషే క్యాడర్ నైతిక స్థైర్యం పూర్తిగా పడిపోయిందని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. లష్కరే తోయిబా వంటి ఇతర సంస్థలతో పోలిస్తే జైషే మహ్మద్ పరిస్థితి మరింత దయనీయంగా ఉన్నట్లు తెలుస్తోంది.

 

దాడి జరిగిన వెంటనే ఐఎస్ఐ రంగంలోకి దిగి అజహర్‌ను బహవల్పూర్ నుంచి తరలించింది. తొలుత రావల్పిండిలోని ఓ రహస్య స్థావరంలో పది రోజుల పాటు ఉంచారు. ఆ తర్వాత, బహవల్పూర్‌కు సుమారు 1200 కిలోమీటర్ల దూరంలో ఉన్న గిల్గిట్-బల్టిస్థాన్‌లోని స్కార్దూ ప్రాంతానికి తరలించారు. అక్కడ దాదాపు 20 రోజుల పాటు రెండు వేర్వేరు మసీదులు, ప్రభుత్వ, ప్రైవేట్ గెస్ట్ హౌస్‌లలో అతడి మకామును మార్చుతూ వచ్చారు. బాలాకోట్ దాడుల సమయంలో తలదాచుకున్న పేశ్వర్‌లో కూడా అజహర్ కొన్నాళ్లు ఉన్నట్లు సమాచారం.

 

మరోవైపు, అజహర్ అజ్ఞాతంలోకి వెళ్లడంతో తీవ్ర నిరాశలో ఉన్న తమ క్యాడర్‌లో ధైర్యం నింపేందుకు జైషే సభ్యులు కొత్త ఎత్తుగడ వేశారు. అజహర్ పాత ఆడియో క్లిప్‌లను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తూ, అవి కొత్తవని ప్రచారం చేస్తున్నారు. తమ నాయకుడు ఎక్కడికీ పారిపోలేదని, బహవల్పూర్‌లోనే ఉన్నాడని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్, హిజ్బుల్ ముజాహిదీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్‌లను కూడా ఐఎస్ఐ ఇస్లామాబాద్‌లోని ఓ సురక్షిత ప్రాంతంలో ఉంచి కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తోందని నిఘా వర్గాలు తెలిపాయి. పుల్వామా దాడి, భారత పార్లమెంట్‌పై దాడి, ఐసీ-814 విమానం హైజాక్ వంటి అనేక ఘాతుకాలకు మసూద్ అజహర్ సూత్రధారి అన్న విషయం తెలిసిందే.

ANN TOP 10