AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సినీ కార్మికుల వేతనాలు పెంచాలి: మంత్రి కోమటిరెడ్డి..

టాలీవుడ్ సినీ పరిశ్రమలో కార్మికులు, నిర్మాణ సంస్థల మధ్య కొద్దికాలంగా నలుగుతున్న వేతన వివాదంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ సమస్యకు సామరస్యపూర్వక పరిష్కారం కనుగొనే బాధ్యతలను ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు అప్పగిస్తున్నట్లు రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంగళవారం ప్రకటించారు.

 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సినీ కార్మికుల వేతనాల పెంపు ఆవశ్యకతను నొక్కి చెప్పారు. “హైదరాబాద్ వంటి నగరంలో జీవించాలంటే కచ్చితంగా వేతనాలు పెంచాల్సిందే” అని ఆయన అభిప్రాయపడ్డారు. పరిశ్రమలో దిల్ రాజుకు ఉన్న అనుభవం, అందరితో ఉన్న సత్సంబంధాల దృష్ట్యా ఈ కీలక బాధ్యతను ఆయనకు అప్పగించినట్లు తెలిపారు. కార్మికులు, నిర్మాతల మధ్య సమన్వయం సాధించి, ఇరు పక్షాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనాలని దిల్ రాజుకు సూచించినట్లు వెల్లడించారు.

 

సినిమా టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతులు ఇస్తున్నప్పుడు, అందుకు ప్రతిఫలంగా నిర్మాతలు కూడా కార్మికుల డిమాండ్లను సానుకూలంగా పరిగణనలోకి తీసుకోవాలని మంత్రి హితవు పలికారు. తెలుగు చిత్ర పరిశ్రమ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని, అందువల్ల ఈ వివాదాన్ని త్వరగా ముగించడం అందరికీ శ్రేయస్కరమని అన్నారు.

 

తన ఢిల్లీ పర్యటన ముగిసిన వెంటనే నేరుగా సినీ కార్మికులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకుంటానని మంత్రి కోమటిరెడ్డి హామీ ఇచ్చారు. ప్రభుత్వ జోక్యంతో ఈ వివాదం త్వరలోనే ముగింపు పలుకుతుందని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

ANN TOP 10