దేశంలోని పన్ను చెల్లింపుదారులకు ఆదాయ పన్ను శాఖ శుభవార్త చెప్పింది. పాన్ (శాశ్వత ఖాతా సంఖ్య), టాన్ (పన్ను తగ్గింపు, సేకరణ ఖాతా సంఖ్య) సంబంధిత సేవలను మరింత సులభతరం చేసేందుకు ఉద్దేశించిన ప్రతిష్ఠాత్మక ‘పాన్ 2.0’ ప్రాజెక్టును ప్రారంభించనుంది. ప్రస్తుతం మూడు వేర్వేరు పోర్టళ్లలో అందుబాటులో ఉన్న ఈ సేవలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెచ్చే ఈ భారీ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను ప్రముఖ ఐటీ సంస్థ ఎల్టీఐమైండ్ట్రీకి అప్పగించినట్లు ఓ ఉన్నతాధికారి సోమవారం వెల్లడించారు.
ప్రస్తుతం పాన్‌కు సంబంధించిన పనుల కోసం పన్ను చెల్లింపుదారులు ఈ-ఫైలింగ్ పోర్టల్, యూటీఐఐటీఎస్ఎల్ పోర్టల్, ప్రోటీన్ ఈ-గవ్ పోర్టల్‌ను ఆశ్రయించాల్సి వస్తోంది. ఈ గందరగోళానికి తెరదించుతూ ‘పాన్ 2.0’ పేరుతో ఒకే ఏకీకృత ప్లాట్‌ఫామ్‌ను రూపొందించనున్నారు. కొత్త పాన్ కార్డు జారీ, పాత కార్డులో వివరాల మార్పులు, ఆధార్-పాన్ అనుసంధానం, పాన్ కార్డు రీ-ప్రింట్, ఆన్లైన్ వెరిఫికేషన్ వంటి అన్ని సేవలు ఈ కొత్త పోర్టల్ ద్వారానే లభిస్తాయి.
ఈ ప్రాజెక్టు కోసం మేనేజ్డ్ సర్వీస్ ప్రొవైడర్‌గా (ఎంఎస్పీ) ఎల్‌టీఐమైండ్‌ట్రీ వ్యవహరించనుంది. ప్రాజెక్టు డిజైన్, అభివృద్ధి, అమలు, నిర్వహణ బాధ్యతలను ఆ సంస్థే చూసుకుంటుంది. సుమారు 18 నెలల్లో ఈ కొత్త వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) 2024 నవంబర్ 25న రూ. 1,435 కోట్లను మంజూరు చేసింది.
ఈ కొత్త విధానంలో పాన్ జారీ, మార్పులు వంటివి పూర్తిగా పేపర్‌లెస్ పద్ధతిలో, ఉచితంగా జరుగుతాయి. దరఖాస్తుదారుడి రిజిస్టర్డ్ ఈ-మెయిల్‌కు నేరుగా ఈ-పాన్ పంపిస్తారు. “సాంకేతిక ఆవిష్కరణల ద్వారా పాన్ జారీ ప్రక్రియను, భద్రతను మెరుగుపరిచే ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును తాము దక్కించుకున్నామని” ఎల్‌టీఐమైండ్‌ట్రీ ప్రతినిధి ఒకరు తెలిపారు.
ప్రస్తుతం దేశంలో 81.24 కోట్లకు పైగా పాన్ కార్డులు, 73 లక్షలకు పైగా టాన్ నంబర్లు వాడుకలో ఉన్నాయి. ముఖ్యంగా పాత పాన్ కార్డుదారులు ఎవరూ కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఈ ప్రకటన నేపథ్యంలో బీఎస్ఈలో ఎల్‌టీఐమైండ్‌ట్రీ షేరు ధర 1.42 శాతం పెరిగి రూ. 5,088.25 వద్ద ముగిసింది.