ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) 2025–27 సీజన్ లో టీమిండియా కీలక ముందడుగు వేసింది. ఇంగ్లండ్‌తో ఓవల్ వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో 6 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించి, పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి దూసుకెళ్లింది. ఈ విజయంతో ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీని భారత్ 2-2తో సమం చేసింది.
ఆఖరి రోజు ఆట ప్రారంభమయ్యేసరికి ఇంగ్లండ్ విజయానికి కేవలం 35 పరుగులు అవసరం కాగా, ఆ జట్టు చేతిలో నాలుగు వికెట్లు ఉన్నాయి. దీంతో ఇంగ్లండ్ గెలుపు ఖాయమని అందరూ భావించారు. అయితే, భారత పేసర్లు అద్భుత ప్రదర్శనతో మ్యాచ్‌ను అనూహ్యంగా మలుపు తిప్పారు. ముఖ్యంగా మహ్మద్ సిరాజ్ ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగి ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. దీంతో పరుగుల పరంగా భారత్‌కు ఇది అత్యంత స్వల్ప తేడాతో లభించిన విజయాల్లో ఒకటిగా నిలిచింది.
ఈ గెలుపుతో భారత్ డబ్ల్యూటీసీ పట్టికలో గణనీయమైన పురోగతి సాధించింది. ఐదు మ్యాచ్‌ల అనంతరం 28 పాయింట్లు, 46.67 పాయింట్ల శాతంతో (పీసీటీ) మూడో స్థానంలో నిలిచింది. మరోవైపు, ఈ ఓటమితో ఇంగ్లండ్ నాలుగో స్థానానికి పడిపోయింది. ఆ జట్టు ఖాతాలో 26 పాయింట్లు (43.33 పీసీటీ) ఉన్నాయి. లార్డ్స్ టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా రెండు పాయింట్ల కోతకు గురికావడం ఇంగ్లండ్ స్థానాన్ని మరింత దెబ్బతీసింది.
ప్రస్తుతం డబ్ల్యూటీసీ పట్టికలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంది. వెస్టిండీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన ఆసీస్, 36 పాయింట్లు, 100 శాతం పీసీటీతో ఆధిక్యంలో కొనసాగుతోంది. బంగ్లాదేశ్‌పై సిరీస్ విజయంతో శ్రీలంక 16 పాయింట్లతో (66.67 పీసీటీ) రెండో స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ ఐదు, వెస్టిండీస్ ఆరో స్థానాల్లో ఉన్నాయి. న్యూజిలాండ్, పాకిస్థాన్, డిఫెండింగ్ ఛాంపియన్ దక్షిణాఫ్రికా ఇంకా తమ డబ్ల్యూటీసీ ప్రస్థానాన్ని ప్రారంభించాల్సి ఉంది. సీనియర్ ఆటగాళ్లు లేని యువ జట్టుతో సాధించిన ఈ విజయం, ఛాంపియన్‌షిప్‌లో ముందుకు సాగడానికి భారత్‌కు బలమైన పునాది వేసింది.