కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసిన తర్వాత అప్పులపై వడ్డీని తగ్గించే అంశాన్ని పరిశీలిస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రుణాల చెల్లింపు, రీషెడ్యూల్ మార్పులు చేస్తే ఆర్బీఐ నిబంధనల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టు ఖాతా స్టాండర్డ్ నుంచి సబ్ స్టాండర్డ్‌కు డౌన్ గ్రేడ్ అవుతుందని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు లోక్‌సభలో కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
కాళేశ్వరం ప్రాజెక్టు రుణల పునర్వ్యవస్థీకరణ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నుంచి వినతులు వచ్చాయని తెలిపారు. ప్రాజెక్టు స్పెషల్ పర్పస్ వెహికిల్‌కు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పోరేషన్ రుణాలు ఇచ్చాయని వెల్లడించారు.
పీఎఫ్సీ, ఆర్ఈసీ లాంటి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు వివిధ మార్గాల్లో నిధులు సేకరిస్తాయని, వాటికయ్య ఖర్చుల ఆధారంగా వడ్డీ రేట్లను నిర్ణయిస్తాయని పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తయ్యే సమయాన్ని ఇప్పటికే 2024 డిసెంబరుకు ఆర్ఈసీ పొడిగించినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయ్యాకే రుణాలపై వడ్డీ రేట్లను నిర్ణయిస్తామని స్పష్టం చేశారు.