తెలంగాణలో సంచలనం సృష్టించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో జరిగిన భారీ అవకతవకలకు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యక్షంగా, పరోక్షంగా పూర్తి బాధ్యత వహించాలని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తన నివేదికలో తేల్చిచెప్పింది. ప్రాజెక్టు ప్రణాళిక, నిర్మాణం, నిర్వహణ మొదలుకొని ధరల సర్దుబాట్లు, కాంట్రాక్టు సవరణలు, ఆర్థిక హామీల వరకు అన్నింటిలోనూ కేసీఆర్ పాత్ర ఉందని కమిషన్ నిర్ధారించింది. ఈ మేరకు అధికారులు అధ్యయనం చేసి సిద్ధం చేసిన నివేదిక సారాంశంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో నాణ్యతా లోపాలు, డిజైన్ల రూపకల్పన, నిర్వహణలో వైఫల్యాలు అంటూ వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన జస్టిస్ ఘోష్ కమిషన్, తన తుది నివేదికను జులై 31న ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదికను క్షుణ్ణంగా అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ఆగస్టు 1న ఓ ఉన్నతాధికారుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ రూపొందించిన సారాంశాన్ని సోమవారం జరగనున్న రాష్ట్ర కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు.
ఈ నివేదికలో కేవలం కేసీఆర్‌నే కాకుండా, పలువురు రాజకీయ, అధికార ప్రముఖులను కూడా బాధ్యులుగా పేర్కొన్నారు. నాటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఆర్థిక బాధ్యతల నుంచి తప్పుకున్నారని, మొత్తం వ్యవహారాన్ని కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ (కేఐపీసీఎల్)పై నెట్టేశారని కమిషన్ అభిప్రాయపడింది. అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి జవాబుదారీతనం లేకుండా అడ్డగోలు ఆదేశాలు జారీ చేస్తూ పరిపాలనా ప్రక్రియను నిర్వీర్యం చేశారని తెలిపింది.
అదేవిధంగా, నాటి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి, ఐఏఎస్ అధికారి ఎస్.కె. జోషి.. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణాన్ని అడ్డుకోగల కీలకమైన నిపుణుల కమిటీ నివేదికను తొక్కిపెట్టారని కమిషన్ గుర్తించింది. సీఎం కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా పనిచేసిన ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ కీలక దస్త్రాలను కేబినెట్ ముందు ఉంచకుండా నిబంధనలు ఉల్లంఘించారని నివేదికలో ఉంది. కేఐపీసీఎల్ బోర్డు సభ్యులు సైతం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని, నేరపూరిత విశ్వాసఘాతుకానికి పాల్పడ్డారని పేర్కొంది.
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ కాంట్రాక్టర్ ఎల్ అండ్ టీ సంస్థకు ఎలాంటి సర్టిఫికెట్లు పొందే అర్హత లేదని, దెబ్బతిన్న ఏడో బ్లాకును సొంత ఖర్చుతో పునరుద్ధరించాలని కమిషన్ ఆదేశించింది. పలువురు చీఫ్ ఇంజనీర్లు, ఇతర ఇంజనీరింగ్ అధికారులు డిజైన్లలో లోపాలు, నాణ్యత లేమికి బాధ్యులని తేల్చింది. కాంట్రాక్టర్లకు మేలు చేసేలా తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చారని స్పష్టం చేసింది.
2023 అక్టోబర్‌లో మేడిగడ్డ బ్యారేజీ పియర్లు కుంగిపోవడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై 2024 మార్చి 14న జస్టిస్ ఘోష్‌తో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.