రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తాజాగా మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణలో సగ భాగం బీసీలు ఉన్నారని… వాళ్లకు రాజకీయంగా సగ భాగం దక్కాలనే సంకల్పంతో తాము దీక్ష చేపట్టామని చెప్పారు. కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పినట్టు బీసీలకు న్యాయం చేయాలని కొన్ని నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటపడుతున్నామని… కానీ ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదని అన్నారు.
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేసిన కవిత… రేవంత్ ప్రభుత్వం బీజేపీపై నెపం నెట్టి తప్పించుకోవాలని చూస్తోందని దుయ్యబట్టారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం ధర్నాచౌక్ వద్ద కవిత 72 గంటల నిరాహార దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
దీక్షకు ముందు బీఆర్ అంబేద్కర్, పూలే, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు ఆమె నివాళి అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ… బీసీ బిల్లుపై బీజేపీ లేవనెత్తిన అనుమానాలను సీఎం రేవంత్ నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో ముస్లింలకు అదనంగా 10 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇవ్వాలని అన్నారు. ముస్లింలను మినహాయించి కేవలం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానీ బీజేపీ మీద నెపం నెట్టి రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తోందని విమర్శించారు.
ముస్లింలను మినహాయించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని సీఎం చెబితే… అప్పుడు బీజేపీ ఎందుకు ఒప్పుకోదో తామూ చూస్తామని అన్నారు. ముస్లింలకు అదనంగా 10 శాతం రిజర్వేషన్ల కోసం పార్లమెంటులో ప్రత్యేకంగా బిల్లు పెట్టాలని కోరారు. రేవంత్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ దిశగా కృషి చేయాలని సూచించారు. బీసీ రిజర్వేషన్ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదానికి పంపి, తెలంగాణ ప్రభుత్వం చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తోందని దుయ్యబట్టారు.