బనకచర్ల ప్రాజెక్టు గోదావరి నది నీటిని రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఓ భారీ ప్రాజెక్టు. ఇది సముద్రంలోకి వృథాగా పోయే నీటిని వినియోగించాలని కూటమి సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, తెలంగాణ ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తోంది. ఇది గోదావరి నీటి కేటాయింపులపై 1980 జల వివాదాల ట్రైబ్యునల్, 2014 రాష్ట్ర విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తుందని, తెలంగాణ రైతులకు నీటి హక్కులపై నష్టం కలిగిస్తుందని రేవంత్ సర్కార్ ఆరోపిస్తోంది. ఏపీ ప్రభుత్వం కేంద్ర ఆర్థిక సహకారంతో ముందుకు వెళ్తుండగా.. తెలంగాణ న్యాయపరమైన పోరాటానికి సిద్ధమవుతోంది. ఈ వివాదం రెండు రాష్ట్రాల మధ్య జల వనరుల హక్కులపై తీవ్ర చర్చను దారితీస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా మంత్రి ఉత్తమ్ కమార్ రెడ్డి బనకచర్ల ప్రాజెక్టుపై మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.
మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం…
పోలవరం, బనకచర్ల లింక్ ప్రాజెక్టును తెలంగాణ అన్ని రకాలుగా వ్యతిరేకిస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. ‘బనకచర్ల పై ఏపీ మంత్రి లోకేష్ వ్యాఖ్యలు సరైనవి కావు. లోకేష్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టును గోదావరి రివర్ మెనేజ్ మెంట్ బోర్డు వ్యతిరేకించింది. నేనే స్వయంగా నా లెటర్ హెడ్ తో కేంద్రానికి లేఖలు రాశాను. బనకచర్ల ను ఆపేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. బనకచర్ల పై మా స్టాండ్ క్లియర్ గా ఉంది’ అని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
బీఆర్ఎస్ ఆరోపణలు పబ్లిసిటీ కోసం మాత్రమే……
బీఆర్ఎస్ పార్టీ చేసే నిరాధారమైన ఆరోపణలు పబ్లిసిటీ కోసం మాత్రమే. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. బీఆర్ఎస్ వి గాలి మాటలు తప్ప వాస్తవం లేదు. బనకచర్ల ప్రాజెక్టుకు మేము వ్యతిరేకం. మేము ఎంతటి పోరాటానికి అయినా సిద్ధం. కేంద్ర బీజేపీతో టీడీపీ పొత్తు ఉందని లోకేష్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇది ప్రజాస్వామ్య దేశం.. పొత్తు ఉందని మాట్లాడితే కుదురదు. పోలవరం బనకచర్ల ఇల్లీగల్ ప్రాజెక్టు’ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.
కేబినెట్ లో కీలక అంశాలపై చర్చిస్తాం….
అలాగే.. కాళేశ్వరం ప్రాజెక్టుపై కూడా మంత్రి మాట్లాడారు. 650 పేజీలతో కాళేశ్వరం పై జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందని అన్నారు. రేపు సాయంత్రం కమిషన్ రిపోర్ట్ అధ్యయనం కమిటీతో సమావేశం అవుతానని చెప్పారు. ఈ నెల 4 న క్యాబినెట్ లో కీలక అంశాలపై చర్చిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.