భారత్‌పై దాడి చేసే ఉగ్రవాదులు పాతాళ లోకంలో దాక్కున్నా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్థాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఉగ్రవాదాన్ని, అన్యాయాన్ని అణచివేసేందుకు అవసరమైతే భారత్ ‘కాళభైరవుడి’ రూపం దాలుస్తుందని స్పష్టం చేశారు. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో ప్రపంచం భారతదేశ రుద్ర రూపాన్ని చూసిందని ఆయన వ్యాఖ్యానించారు.
శనివారం తన పార్లమెంటరీ నియోజకవర్గమైన వారణాసిలో ఏర్పాటు చేసిన భారీ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిని గుర్తుచేసుకుంటూ, ఆ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రతీకారం తీర్చుకుంటానని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నానని తెలిపారు. మహాదేవుని ఆశీస్సులతో ‘ఆపరేషన్ సిందూర్’ విజయం సాధించిందని, ఈ విజయాన్ని కాశీ విశ్వనాథుని పాదాల చెంత సమర్పిస్తున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా విపక్షాలపై ప్రధాని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. “‘ఆపరేషన్ సిందూర్’ విజయాన్ని దేశంలోని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలను భారత్ ధ్వంసం చేయడం చూసి కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు కన్నీళ్లు పెట్టుకుంటున్నాయి. మన సైనికుల విజయాన్ని వారు ఓర్వలేకపోతున్నారు” అని ఆరోపించారు. ఉగ్రవాదులను ఏరివేయడానికి ఫలానా రోజు ఎందుకు ఎంచుకున్నారని ప్రశ్నించడం మన సైన్యాన్ని, అమరవీరులను అవమానించడమేనని మోదీ పేర్కొన్నారు.
ఈ ఆపరేషన్‌లో ‘మేడ్ ఇన్ ఇండియా’ ఆయుధాల శక్తిని ప్రపంచం చూసిందని మోదీ అన్నారు. ముఖ్యంగా బ్రహ్మోస్ క్షిపణుల కారణంగా పాకిస్థాన్ నిద్రలేని రాత్రులు గడుపుతోందని తెలిపారు. త్వరలో ఈ క్షిపణులను ఉత్తరప్రదేశ్‌లోనే తయారు చేయనున్నట్లు ప్రకటించారు. భవిష్యత్తులో పాకిస్థాన్ మరోసారి దుస్సాహసానికి పాల్పడితే, యూపీలో తయారైన క్షిపణులే ఉగ్ర స్థావరాలకు సమాధానం చెబుతాయని హెచ్చరించారు. ఇది కొత్త భారత్ అని, మహాదేవుణ్ణి పూజించే ఈ దేశం, అవసరమైనప్పుడు కాళభైరవుడిగా మారడానికి వెనుకాడదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.