ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఈ నెల 13న బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భూమిపూజ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను బాలకృష్ణ, ఆయన సన్నిహితులు గాంధీ, సిద్ధాంతి నాగమల్లేశ్వరరావు శనివారం పరిశీలించారు.
ఆసుపత్రి నిర్మాణ ప్రణాళికలను సీఆర్డీఏ అదనపు కమిషనర్ ప్రవీణ్ బాలకృష్ణకు వివరించారు. మొత్తం 21 ఎకరాల విస్తీర్ణంలో క్యాన్సర్ ఆసుపత్రి నిర్మిస్తున్నట్లు బాలకృష్ణ వెల్లడించారు. మూడు దశల్లో ఆసుపత్రి నిర్మాణం ఉంటుందని ఆయన తెలిపారు.
జాతీయ అవార్డు రావడంపై సంతోషం
మహిళా సాధికారత ఆధారంగా తీసిన భగవంత్ కేసరి చిత్రానికి జాతీయ అవార్డు రావడంపై బాలకృష్ణ హర్షం వ్యక్తం చేశారు. ఇకపై తాను తీయబోయే సినిమాలలో సమాజానికి సంబంధించిన మంచి సందేశాలు ఉంటాయని తెలిపారు. హిందూపురం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నట్లు చెప్పారు. పరిశ్రమలు, అంతర్రాష్ట్ర రహదారుల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు.