మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత తీవ్రంగా విమర్శలు గుప్పించారు. పొగాకు రైతుల వద్దకు వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి కేజీకి, టన్నుకు తేడా తెలియకుండా మాట్లాడుతున్నారని ఆమె దుయ్యబట్టారు. మామిడి రైతుల వద్దకు వెళ్లి మామిడి కాయలు తొక్కించిన ఘనత జగన్‌కే దక్కుతుందని ఎద్దేవా చేశారు.
శనివారం గజపతి నగరం వ్యవసాయ మార్కెట్ యార్డులో ‘అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్’ తొలి విడత నిధుల విడుదల కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రైతుల విషయంలో రాజకీయం చేయరాదని హితవు పలికారు. రాజకీయం చేసేందుకు వైసీపీ నాయకులు వ్యవసాయాన్ని అడ్డుపెట్టుకుంటున్నారని విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం రైతు కుటుంబాలకు మేలు చేసే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తుంటే ఉద్దేశపూర్వకంగా అడ్డు తగులుతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యవసాయం అంటే ఎంతో ఇష్టమని, రీసర్వేలో రైతుల ఇబ్బందులు తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రైతులు సాంకేతికతను వినియోగించుకోవాలని, ప్రకృతి వ్యవసాయం చేసేందుకు ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు.