కేంద్ర ప్రభుత్వంలో ఉన్నామనే ధైర్యంతో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ బనకచర్ల ప్రాజెక్టును కట్టి తీరుతామని చెబుతున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టును కట్టి తీరుతామని లోకేశ్ మాట్లాడుతుంటే తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. ‘మా తెలంగాణ హక్కుల సంగతి ఏమిటి’ అని ముఖ్యమంత్రి, నీటి పారుదల శాఖ మంత్రి, కాంగ్రెస్ నాయకులు ఎవరూ మాట్లాడటం లేదని విమర్శించారు.
ఏదో లోపాయికారి ఒప్పందం చేసుకున్నందువల్ల వారు మాట్లాడటం లేదని ఆయన ఆరోపించారు. గోదావరి-బనకచర్ల అజెండాలో ఉంటే తాము ఉమ్మడి రాష్ట్రాల సమావేశానికి రాబోమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేంద్రానికి లేఖ రాస్తే, ముఖ్యమంత్రి, అధికారులు మాత్రం ఇటీవల హాజరయ్యారని గుర్తుచేశారు. రాత్రికి రాత్రి ఢిల్లీకి వెళ్లి… మొదటి అంశమే బనకచర్ల ఉన్నప్పటికీ సమావేశంలో పాల్గొని, కమిటీ వేయడానికి అంగీకరించారని ఆరోపించారు.
తెలంగాణ కాంగ్రెస్ నేతల ధైర్యం చూసుకొని లోకేశ్ బనకచర్ల కట్టి తీరుతామని చెబుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బనకచర్లపై ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలని నిలదీశారు. కాంగ్రెస్, బీజేపీ మౌనం కారణంగానే చంద్రబాబు బనకచర్లపై బుల్డోజింగ్ విధానంతో వెళుతున్నారని విమర్శించారు. మేం బనకచర్ల కట్టి తీరుతామని లోకేశ్ చెబుతుంటే, అసలు బనకచర్ల కడితే కదా అడ్డుకునేది అని రేవంత్ రెడ్డి చెబుతుండటం విడ్డూరంగా ఉందని అన్నారు.
రేవంత్ రెడ్డి గురుదక్షిణ చెల్లించుకునే పనిలో ఉన్నట్లుగా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. బనకచర్లపై లోకేశ్ బరితెగించి మాట్లాడుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు. తన పదవిని కాపాడుకోవడం కోసం రేవంత్ రెడ్డి గురు దక్షిణ చెల్లించే పనిలో ఉండగా, ఢిల్లీలో పీఠాన్ని కాపాడుకోవడం కోసం బీజేపీ మౌనంగా ఉంటోందని ధ్వజమెత్తారు.