హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో జరిగిన రేవ్ పార్టీ కేసులో ఎక్సైజ్ పోలీసులు కీలక సమాచారాన్ని వెల్లడించారు. ఈ రేవ్ పార్టీలను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అశోక్ నాయుడు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రతి వీకెండ్ లో ఏపీ నుంచి యువతీ యువకులను హైదరాబాద్‌కు తీసుకొచ్చి ఈ పార్టీలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది.
ఎక్సైజ్ అధికారులు నిర్వహించిన దాడుల్లో అశోక్ నాయుడు వద్ద నుంచి గంజాయి, డ్రగ్స్, కండోమ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ అలవాటు ఉన్న యువతులను లక్ష్యంగా చేసుకుని అశోక్ నాయుడు ఈ పార్టీలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టయిన వారిలో మంగళగిరి, విజయవాడ, కాకినాడ, రాజమండ్రికి చెందిన 11 మంది ఉన్నట్లు గుర్తించారు.
కేసులో మరో సంచలన విషయం ఏమిటంటే, అశోక్ నాయుడు ఉపయోగించిన ఫార్చునర్ కారు (నెంబర్ AP 39 SR 0001)కు లోక్‌సభ ఎంపీ స్టిక్కర్ అంటించి ఉంది. ఈ స్టిక్కర్‌ను అతను ఎవరి నుంచి తీసుకున్నాడనే విషయంపై ఎక్సైజ్ అధికారులు ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో ఇతర నిందితులైన శ్రీనివాస్ చౌదరి, అఖిల్ పరారీలో ఉన్నట్లు సమాచారం.
ఈ రేవ్ పార్టీలు కొండాపూర్‌లోని ఎస్‌వీ నిలయం సర్వీస్ అపార్ట్‌మెంట్‌లో జరిగాయని, పోలీసులకు సమాచారం అందడంతో దాడులు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. కేసు విచారణ కొనసాగుతోంది.