రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ‘ఆపరేషన్ సిందూర్’ పై లోక్‌సభలో విపక్షాలు అడిగిన ప్రశ్నల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపరేషన్ సిందూర్ పై పార్లమెంటులో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విపక్ష ఎంపీలు ఈ ఆపరేషన్‌లో భారత సైనికులకు జరిగిన నష్టం గురించి, ఎన్ని భారత విమానాలు కూల్చివేతకు గురయ్యాయి అనే దాని గురించి మాత్రమే ప్రశ్నించారని విమర్శించారు. ఇటువంటి ప్రశ్నలు దేశ ప్రజల మనోభావాలను ఏ మాత్రం ప్రతిబింబించవని సింగ్ అన్నారు.
రాజ్‌నాథ్ సింగ్ ఆపరేషన్ సిందూర్ విజయాన్ని గట్టిగా నొక్కి చెప్పారు. ఈ ఆపరేషన్‌లో ఒక్క భారతీయ సైనికుడికి కూడా హాని జరగలేదని ఆయన స్పష్టం చేశారు. “భారత సైన్యం ఎన్ని శత్రు విమానాలను కూల్చివేసింది? ఉగ్రవాద స్థావరాలు ధ్వంసం అయ్యాయా?” వంటి ప్రశ్నలు విపక్షం ఎందుకు అడగలేదని ఆయన ప్రశ్నించారు. ఒకవేళ ఈ వారు ఈ ప్రశ్నలు అడిగితే తమ వద్ద స్పష్టమైన సమాధానాలు ఉన్నాయని అన్నారు.
జాతీయ భద్రతపై దృష్టి సారించాలని, సాయుధ దళాల స్థైర్యాన్ని దెబ్బతీయవద్దని ఆయన ప్రతిపక్షానికి సూచించారు. ఆపరేషన్ విజయం గురించి ఇప్పటికే తెలియజేసినట్లు ఆయన పునరుద్ఘాటించారు. ప్రతిపక్షం ప్రజా సమస్యలకు సంబంధించిన అర్థవంతమైన, బాధ్యతాయుతమైన ప్రశ్నలు అడగడమే వారి పాత్ర అని సింగ్ అన్నారు.