ఏపీలో ఆగస్టు 15 నుంచి కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. దీంతో ఈ పథకం అమలు కోసం అధికారులు పకడ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆర్‌టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు మహిళల ఉచిత బస్సు ప్రయాణ ఏర్పాట్లపై తాజాగా కీలక వివరాలు వెల్లడించారు.
నిన్న తిరుపతి జిల్లాలోని వెంకటగిరి, వాకాడు బస్టాండ్లు, డిపోలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్‌టీసీ ఎండీ మాట్లాడుతూ… వచ్చే నెల నుంచి మహిళలకు ఆర్‌టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించినందున మొత్తం 11వేల బస్సుల్లో 74 శాతం బస్సులను అందుకు కేటాయిస్తున్నామని తెలిపారు.
ఈ సౌకర్యాన్ని ప్రస్తుత జిల్లాలకే పరిమితం చేయకుండా ఉమ్మడి జిల్లాలకు కూడా విస్తరించేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు. వచ్చే రెండు నెలల్లో ప్రతి బస్టాండ్‌లో తాగునీటి సౌకర్యం, కుర్చీలు, ఫ్యాన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆర్‌టీసీలోని అన్ని ర్యాంకుల ఉద్యోగులకు వచ్చే నెలఖారులోగా పదోన్నతులు కల్పిస్తామన్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఆర్‌టీసీ డిపోలకు 1350 కొత్త బస్సులను కేటాయించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే 750 కొత్త బస్సులు మంజూరయ్యాయని, మరో 600 బస్సుల కోసం ప్రతిపాదనలు పంపామని పేర్కొన్నారు.