ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు సింగపూర్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం సింగపూర్ లోని షాంగ్రీ-లా హోటల్ వాలీ వింగ్‌లో భారత హైకమిషనర్ డాక్టర్ శిల్పక్ అంబులేతో చంద్రబాబు భేటీ అయ్యారు ఈ సమావేశంలో మంత్రులు నారా లోకేశ్, పి.నారాయణ, టీజీ భరత్‌తో పాటు ఏపీ అధికారులు పాల్గొన్నారు. ఆరోగ్య రంగం, గ్రీన్ హైడ్రోజన్, ఏవియేషన్, సెమి కండక్టర్స్, పోర్టులు, పారిశ్రామిక రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను చంద్రబాబు బృందం శిల్పక్ అంబులేకు వివరించారు.
అనంతరం శిల్పక్ అంబులే మాట్లాడుతూ.. భారతదేశంతో సింగపూర్ ప్రభుత్వం సత్సంబంధాలను కలిగి ఉందని అన్నారు. సింగపూర్ ప్రభుత్వంలో, స్థానిక పారిశ్రామిక వర్గాల్లో సీబీఎన్ బ్రాండ్ కు ప్రత్యేక గుర్తింపు ఉందని ఆయన పేర్కొన్నారు. గతంలో సింగపూర్ తో కలిసి అమరావతి ప్రాజెక్టును చేపట్టిన విషయాన్ని గుర్తుచేస్తూ.. కొన్ని కారణాల వల్ల ప్రాజెక్టు నుంచి సింగపూర్ తప్పుకుందని చెప్పారు. ఏపీలో పెట్టుబడులకు సింగపూర్ సంస్థలు ఆసక్తిగా ఉన్నాయని తెలిపారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. ఏపీలో కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త పాలసీలను, పెట్టుబడులకు గల అవకాశాలను శిల్పక్ అంబులేకు వివరించారు. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు ఏపీలో ఇప్పటికే మొదలయ్యాయని చెప్పారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో 160 గిగావాట్ల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నట్లు చంద్రబాబు వివరించారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో పాటు డిఫెన్స్, ఏరో స్పేస్, ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్ సంస్థలకు రాయలసీమ ప్రాంతం అనువుగా ఉంటుందని తెలిపారు. ఏపీలో చేపడుతున్న ప్రాజెక్టుల గురించి మంత్రి నారాయణ, విద్యా రంగంలో ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, తమ ఆలోచనలను మంత్రి నారా లోకేశ్ వివరించారు.