హైదరాబాద్ లోని కొండాపూర్ లో రేవ్ పార్టీ కలకలం రేపింది. శనివారం రాత్రి ఎస్వీ నిలయం అపార్ట్ మెంట్ లో కొంతమంది రేవ్ పార్టీకి ఏర్పాట్లు చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారంతో ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి పార్టీని భగ్నం చేశారు. పార్టీ నిర్వాహుకులు సహా మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారేనని సమాచారం. విజయవాడకు చెందిన నాయుడు అలియాస్ వాసు, శివం రాయుడు ఏపీ నుంచి సంపన్న యువకులను పిలిపించి వీకెండ్ లో రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు.
అపార్ట్ మెంట్ లో సోదాలు నిర్వహించగా.. 2.080 కేజీల గంజాయి, 50 ఓజీ కుష్ గంజాయి, 11.57 గ్రాముల మ్యాజిక్ ముష్రూమ్, 1.91 గ్రాముల డ్రగ్స్ లభించినట్లు తెలిపారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో కింగ్ కెన్ షేర్ రాహుల్, ఆర్గనైజర్లు ప్రవీణ్ కుమార్ అలియాస్ మన్నే, అప్పికోట్ల అశోక్ కుమార్, సమ్మెల సాయికృష్ణ, హిట్ జోసఫ్, తోట కుమారస్వామి, అడపా యశ్వంత్, శ్రీదత్, నంద, సమతా, తేజ ఉన్నారు. మరో ముగ్గురు పరారయ్యారని, వారిపైనా కేసు నమోదు చేశామని అధికారులు తెలిపారు.