తెలంగాణ రాష్ట్రానికి వరంగల్ నగరాన్ని రెండో రాజధానిగా చేద్దామని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ అధికారులకు సూచించారు. వరంగల్ జిల్లా ప్రగతికి అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా సమీక్ష సమావేశంలో మంత్రి ఈ కీలక సూచనలు చేశారు. వరంగల్ నగర అభివృద్ధి, వరంగల్ విమానాశ్రయం, మెగా టెక్స్‌టైల్ పార్క్, భద్రకాళి దేవస్థానం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఔటర్ రింగ్ రోడ్డు, రైల్వే తదితర అంశాలపై మంత్రులు సంయుక్తంగా సమీక్షించారు.
మామునూరు విమానాశ్రయానికి నిధులు కేటాయించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు. విమానాశ్రయానికి అవసరమైన పనులపై దృష్టి సారించాలని మంత్రి సూచించారు. వెటర్నరీ ఆసుపత్రులను కలెక్టర్లు, జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేకంగా పరిశీలించాలని మంత్రి అన్నారు. వరంగల్ నగర సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా అధికారులు పని చేయాలని సూచించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా చారిత్రాత్మక వరంగల్ నగరాన్ని తెలంగాణ రెండవ రాజధానిగా చేయాలన్న సంకల్పంతో పనిచేయాలని మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ నగర అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ఆమె అన్నారు. వరంగల్ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నమైన మామునూరు విమానాశ్రయం కల త్వరలో సాకారం కానుందని అన్నారు. భూసేకరణకు ఇబ్బందులు లేకుండా నిధులు విడుదల చేసినట్లు ఆమె తెలిపారు.