యూరోపియన్ యూనియన్ (ఈయూ) రష్యా చమురుపై విధించిన ఆంక్షలు భారతీయ షిప్పింగ్ కంపెనీలపైనా, భారతీయ నౌకా కెప్టెన్లపైనా ప్రభావం చూపుతున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి చెందిన ఇంటర్‌షిప్పింగ్ సర్వీసెస్ హబ్ అనే షిప్పింగ్ కంపెనీకి చెందిన భారతీయ విభాగం ఈ ఆంక్షల వల్ల ప్రభావితమైంది. అంతేకాకుండా, క్రూడ్ ఆయిల్ ట్యాంకర్ కెప్టెన్ అభినవ్ కమల్‌పై కూడా ఈ ఆంక్షలు దెబ్బ పడింది.
రష్యా క్రూడ్ ఆయిల్ లేదా పెట్రోలియం ఉత్పత్తులను రవాణా చేసే నౌకలకు కెప్టెన్ అభినవ్ కమల్ మెటీరియల్, సాంకేతిక మరియు ఆర్థిక సహాయం అందించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఈయూ ఆంక్షలు ఎదుర్కొన్న ఏకైక భారతీయ పౌరుడు ఆయనే.
ఇక, ఇంటర్‌షిప్పింగ్ సర్వీసెస్ హబ్ సంస్థ రష్యన్ వ్యాపార కార్యకలాపాల్లో పాల్గొన్న నౌకలకు ఆశ్రయం కల్పించిందని ఆరోపణలు ఎదుర్కొంటోంది. యూరోపియన్ యూనియనేతర సంస్థలు ఇప్పటికీ ఇంటర్‌షిప్పింగ్ సర్వీసెస్ హబ్‌తో వ్యాపారం చేయగలిగినప్పటికీ, ప్రపంచ సముద్ర రంగం మరియు యూరోపియన్ యూనియన్‌ల మధ్య విస్తృత సంబంధాల కారణంగా కెప్టెన్ కమల్ గణనీయమైన సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ ఆంక్షల కారణంగా అతను ఈయూ అనుబంధ నౌకలకు సేవలను అందించడం లేదా స్వీకరించడం కుదరదు.
ఈయూ ఆంక్షలు నయారా ఎనర్జీ లిమిటెడ్ అనే భారతీయ రిఫైనరీ కార్యకలాపాలపై కూడా ప్రభావం చూపడం ప్రారంభించాయి. ఈ రిఫైనరీలో రష్యన్ సంస్థ రోస్‌నెఫ్ట్ కి 49.13 శాతం వాటా ఉంది. షిప్పింగ్ ఆపరేటర్లు నయారా ఎనర్జీతో ఉత్పత్తుల ఎగుమతులు మరియు ముడి చమురు దిగుమతులకు సహకరించడానికి వెనుకాడటంతో, కొన్ని రవాణాలు రద్దయ్యాయి. అయితే, భారతదేశం ఇతర దేశాలు విధించిన ఏకపక్ష ఆంక్షలను ఇప్పటికీ తిరస్కరిస్తోంది.