AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మానవత్వం సిగ్గుపడే దారుణం..! 15 ఏళ్ల బాలికపై అన్నదమ్ముల అత్యాచారం.. సజీవంగా పూడ్చిపెట్టే యత్నం..!

ఒడిశాలోని జగత్‌సింగ్‌పూర్ జిల్లాలో మానవత్వం సిగ్గుపడే దారుణం వెలుగులోకి వచ్చింది. 15 ఏళ్ల బాలికపై ఇద్దరు సోదరులు పలుమార్లు అత్యాచారం చేయడమే కాకుండా, ఆమె ఐదు నెలల గర్భవతి అని తెలియడంతో, నేరాన్ని దాచిపెట్టేందుకు ఆమెను సజీవంగా పూడ్చిపెట్టేందుకు ప్రయత్నించారు. నిందితులైన భాగ్యధర్ దాస్, పంచనన్ దాస్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. మూడో నిందితుడు తులు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.

 

బనశ్బార గ్రామానికి చెందిన ఈ ఇద్దరు సోదరులు బాధితురాలిపై ఎన్నో రోజులుగా లైంగిక దాడికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. ఆమె గర్భం దాల్చిన విషయం తెలియడంతో, తాము చేసిన నేరాన్ని దాచిపెట్టడానికి నిందితులు ఒక దారుణమైన పథకం పన్నారు. ఆమెను గొయ్యిలో పాతిపెట్టి సజీవంగా పూడ్చిపెట్టాలని నిర్ణయించుకున్నారు.

 

అబార్షన్ చేయిస్తామని బాధితురాలిని నమ్మించి ఒక నిర్జన ప్రదేశానికి పిలిపించారు. అక్కడ అప్పటికే గొయ్యి తవ్వి ఉంచడాన్ని గుర్తించిన బాధితురాలు షాక్‌కు గురైంది. అబార్షన్ చేయించుకోకపోతే పూడ్చిపెట్టేస్తామని నిందితులు బెదిరించినప్పటికీ, ఆమె ధైర్యం చేసి వారి బారి నుంచి తప్పించుకుంది. అనంతరం తన తండ్రికి ఈ భయంకరమైన దారుణాన్ని వివరించింది.

 

బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కుజంగ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. బాధితురాలిని జిల్లా హెడ్‌క్వార్టర్స్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించగా, ఆమె ఐదు నెలల గర్భవతి అని నిర్ధారణ అయింది. అరెస్ట్ చేసిన ఇద్దరు నిందితులను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. పరారీలో ఉన్న మూడో నిందితుడు తులును పట్టుకునేందుకు పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

 

ఒడిశాలో పెరుగుతున్న లైంగిక దాడులు

జగత్‌సింగ్‌పూర్ జిల్లాలో ఈ వారంలో నమోదైన రెండో లైంగిక హింస కేసు ఇది. మంగళవారం ఒక బాలిక బర్త్‌డే పార్టీ నుంచి తిరిగి వస్తుండగా, ఇద్దరు వ్యక్తులు ఆమెను కిడ్నాప్ చేసి పొలంలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. తీవ్ర రక్తస్రావంతో ఆసుపత్రిలో చేరిన బాలిక చికిత్స పొందుతోంది. ఆదివారం, మల్కనగిరి జిల్లాలో మరో బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారి బారి నుంచి ఆమె తప్పించుకున్న తర్వాత ట్రక్ డ్రైవర్ మరోసారి అత్యాచారానికి పాల్పడ్డాడు.

ANN TOP 10