ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో 250 కుటుంబాలను వ్యక్తిగతంగా దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో పేదరికాన్ని రూపుమాపే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘పీ4’ (ప్రజా-ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం) కార్యక్రమంలో భాగంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
శుక్రవారం సచివాలయంలో ‘పీ4’ కార్యక్రమంపై అధికారులతో సమీక్ష నిర్వహించిన సందర్భంగా ముఖ్యమంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన ‘పీ4’ లోగోను ఆవిష్కరించారు. అనంతరం అధికారులు ముఖ్యమంత్రికి ‘#IAmMaargadarshi’ (నేను మార్గదర్శిని) బ్యాడ్జ్ను అందజేశారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, “దత్తత తీసుకున్న ఈ 250 కుటుంబాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసే బాధ్యత పూర్తిగా నాదే. వారి అభ్యున్నతి కోసం ఒక పక్కా ప్రణాళికను రూపొందిస్తున్నాం,” అని స్పష్టం చేశారు. పేదరికంపై ప్రభుత్వం సాగిస్తున్న ఈ పోరాటంలో తనతో పాటు తన కుటుంబ సభ్యులు కూడా భాగస్వాములు అవుతారని ఆయన తెలిపారు.
గతంలో జన్మభూమి స్ఫూర్తితో గ్రామాలను అభివృద్ధి చేశామని, ఇప్పుడు అదే స్ఫూర్తితో ‘పీ4’ కార్యక్రమం ద్వారా పేద కుటుంబాలను ఆదుకోవడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు. పేదలకు అండగా నిలిచే ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని, దేశానికే ఆదర్శంగా నిలిచేలా దీన్ని తీర్చిదిద్దుతామని చంద్రబాబు వివరించారు.