AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వైఎస్సార్ పార్టీ తమ కార్యాచరణలో కీలక మార్పు..! ఇక వారికి గుడ్ బై..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ కార్యాచరణలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టినట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు. ఎన్నికల సమయంలో బయటి ఏజెన్సీలు, రాజకీయ వ్యూహకర్తలపై ఆధారపడటం సరైన పద్ధతి కాదని, భవిష్యత్తులో అలాంటి వాటికి తావుండదని ఆయన స్పష్టం చేశారు. ఇకపై పార్టీని క్షేత్రస్థాయి నుంచి సొంతంగా నిర్మించుకోవడంపైనే పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తామని తెలిపారు.

 

సజ్జల మాట్లాడుతూ, “గతంలో ఎన్నికల సమయంలో టాస్క్ ఫోర్స్ లాగా బయటి సంస్థలపై ఆధారపడటం జరిగింది. అయితే ఇకపై వాటి అవసరం లేదు. మాకు ఇప్పుడు కావాల్సినంత సమయం ఉంది. గ్రామ స్థాయి నుంచి పార్టీని పటిష్టంగా నిర్మించుకుంటున్నాం. టెక్నాలజీని వాడుకుని, పార్టీ అధినేత సందేశాన్ని నేరుగా కార్యకర్తకు చేరవేసేలా కమ్యూనికేషన్ వ్యవస్థను రూపొందిస్తున్నాం,” అని వివరించారు. ఏడాదిలోగా పార్టీ సంస్థాగత నిర్మాణం పూర్తిస్థాయిలో రూపుదిద్దుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

 

గత ప్రభుత్వంలో పాలనపైనే అధినేత జగన్ మోహన్ రెడ్డి ఎక్కువగా దృష్టి పెట్టడం వల్ల సంస్థాగత నిర్మాణంపై అనుకున్నంతగా దృష్టి పెట్టలేకపోయామని సజ్జల అంగీకరించారు. ఈ కారణంగానే ఎన్నికల సమయంలో బయటి సంస్థల అవసరం ఏర్పడిందని పరోక్షంగా తెలిపారు.

 

ఇదే క్రమంలో విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై స్పందిస్తూ, పార్టీ నుంచి వెళ్లిపోయిన వారు ఎవరినో సంతృప్తి పరచడానికే మాట్లాడుతుంటారని అన్నారు. వైసీపీలో జగన్ మోహన్ రెడ్డి ఒక్కరే నాయకుడని, తామంతా ఆయనకు మద్దతుగా పనిచేసే సైనికులం మాత్రమేనని స్పష్టం చేశారు. పార్టీలో ఎలాంటి కోటరీలు లేవని, ఆ ఆరోపణలను ఆయన ఖండించారు.

ANN TOP 10