భారతదేశంలో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న స్థాయిలో సమగ్రమైన డేటా మరే ఇతర రాష్ట్రానికీ లేదని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. దేశంలో కులగణన నిర్వహణకు ఇది మార్గదర్శకంగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. కులగణనపై ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన ప్రజెంటేషన్‌కు రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అంచనాలకు మించి రాణించారని ప్రశంసించారు.
కులగణన నిర్వహణ అంత సులభం కాదని ఆయన అన్నారు. అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఈ సర్వేను విజయవంతంగా పూర్తి చేసిందని వ్యాఖ్యానించారు. కార్యాలయాలలో కూర్చొని కులగణన చేస్తే సరైన ఫలితాలు రావని ఆయన అన్నారు. తెలంగాణ కులగణనలో దాదాపు 56 ప్రశ్నలు అడిగారని గుర్తు చేశారు. సరైన డేటా ఉంటే ఏదైనా సాధించగలమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ చేతిలో ఇప్పుడు సరైన డేటా ఉందని రాహుల్ గాంధీ అన్నారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సరైన రీతిలో కులగణన చేయదని ఆయన విమర్శించారు. దేశ వాస్తవ చిత్రాన్ని బహిర్గతం చేయడానికి ఆ పార్టీ ఇష్టపడదని వ్యాఖ్యానించారు. సమాజాన్ని వేగంగా అభివృద్ధి చేసే శక్తి విద్యకు మాత్రమే ఉందని ఆయన అన్నారు. హిందీ, ఇతర ప్రాంతీయ భాషలు ముఖ్యం కాదని తాను చెప్పడం లేదని, కానీ ఆంగ్లం కూడా ముఖ్యమేనని ఆయన అన్నారు. బీజేపీ నేతల పిల్లలు ఏ భాషలో చదువుతున్నారని ఆయన ప్రశ్నించారు.