ఆర్సీబీ విజయోత్సవ సభలో తొక్కిసలాట ఘటనపై చర్యలకు కర్ణాటక ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ దుర్ఘటనపై జస్టిస్ జాన్ మైఖేల్ డి’కున్హా కమిషన్ ఇచ్చిన నివేదికను మంత్రివర్గం ఆమోదించింది. దీంతో ఆర్సీబీ, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్, ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ డీఎన్ఏ ఎంటర్‌టైన్‌మెంట్, బెంగళూరు పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేసినట్లయింది.
ఈ ఘటనకు కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ డీఎన్ఏ ఎంటర్‌టైన్‌మెంట్, బెంగళూరు పోలీసులదే బాధ్యత అని జ్యుడీషియల్ కమిషన్ నివేదిక ఇచ్చింది. విచారణలో భాగంగా ఘటనతో సంబంధం ఉన్న ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించింది. ప్రత్యక్ష సాక్షులు, క్రికెట్ సంఘం, పోలీసు అధికారుల వాంగ్మూలాలను రికార్డు చేసింది.
జూన్ 4వ తేదీన మధ్యాహ్నం స్టేడియం చుట్టూ దాదాపు 14 కిలోమీటర్ల దూరం వరకు ప్రజలు గుమికూడారు. గం.3.25 సమయంలో విజయోత్సవ వేడుక వద్ద పెద్ద సంఖ్యలో ఉన్న అభిమానులు అదుపు తప్పారు. ఫలితంగా తొక్కిసలాట చోటు చేసుకొని 11 మంది మృతి చెందగా, 50 మంది గాయపడ్డారు. 1, 2, 21 గేట్ నెంబర్ల వద్ద ప్రజలు బలవంతంగా లోపలకు ప్రవేశించేందుకు ప్రయత్నించగా, పోలీసులు వారిని అడ్డుకొన్నారు. ఈ మొత్తం ఘటనపై ఏర్పాటైన న్యాయ కమిషన్ ఇటీవల ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది.