AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పేదరికం లేని సమాజమే కోసమే పీ4 విధానం: మంత్రి నాదెండ్ల మనోహర్..

ప్రపంచ దేశాలకు పెద్ద సవాలుగా మారిన పేదరికాన్ని నిర్మూలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘పీ4 – పేదరికాన్ని పారద్రోలే కార్యక్రమం’ అనే సమగ్ర విధానాన్ని రూపొందించిందని రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

మంగళవారం నాడు సచివాలయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన జరిగిన తెనాలి విజన్ యాక్షన్ ప్లాన్ సమావేశం అనంతరం ఆయన అధికారులతో కలిసి పీ4 పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పీ4 కార్యక్రమం వివరాలతో త్వరలో www.zeropovertyp4.ap.gov.in వెబ్‌సైట్‌ను కూడా అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు.

ఎన్నారైలు, తెనాలి వాసుల భాగస్వామ్యం 

ఈ కార్యక్రమంలో ఎన్నారైలు, ఇతర ప్రాంతాల్లో స్థిరపడిన తెనాలి వాసుల సహకారం తీసుకుంటామని, వారిని భాగస్వాములుగా మార్చే ప్రణాళికను చేపడుతున్నామని మంత్రి పేర్కొన్నారు. దీని ద్వారా ఎక్కువ మంది మహిళలకు, యువతకు ఉపాధి కల్పించడం జరుగుతుందన్నారు.

2047 విజన్… 2029 నాటికి 50 లక్షల కుటుంబాలకు మద్దతు 

కూటమి ప్రభుత్వం 2047 విజన్‌లో భాగంగా, 2029 నాటికి 50 లక్షల కుటుంబాలను పేదరికం నుంచి అభివృద్ధి వైపు నడిపించేందుకు ఈ బృహత్తర కార్యక్రమాన్ని రూపొందించిందని మంత్రి వివరించారు. పేదల సంక్షేమం, సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను గుర్తించి వారికి అవసరమైన మద్దతు కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. నిరుపేద కుటుంబాలను “బంగారు కుటుంబాలుగా” మార్చడమే పీ4 ప్రధాన లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.

తెనాలి నియోజకవర్గంలో పీ4 అమలు 

తెనాలి నియోజకవర్గంలో సుమారు 14,280 బంగారు కుటుంబాలను ఇప్పటికే గుర్తించామని, వారికి అండగా నిలిచేందుకు 376 మంది వ్యక్తులు ముందుకు వచ్చారని మంత్రి నాదెండ్ల తెలిపారు. వీరు దాదాపు 3,289 మందిని దత్తత తీసుకున్నారని చెప్పారు. డేటా వెరిఫికేషన్ అనంతరం, వీరి సహాయంతో ఆ కుటుంబాలకు ఉపాధి, విద్యకు తోడ్పాటు, వ్యవసాయ సాగు మార్కెటింగ్, బ్యాంకు రుణాలు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి వైద్య సహాయం వంటి అంశాల్లో సహాయం అందించడం జరుగుతుందన్నారు.

త్వరలో తెనాలిలో మార్గదర్శకులతో పరిచయ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, ఈ యాక్షన్ ప్లాన్ తెనాలి నియోజకవర్గానికి ఒక రోడ్ మ్యాప్‌గా మారుతుందని మంత్రి నాదెండ్ల ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సమావేశంలో తెనాలి సబ్ కలెక్టర్ సంజన సింహా, తెనాలి ఎమ్మార్వో గోపాలకృష్ణ, కొల్లిపర ఎమ్మార్వో జి. సిద్ధార్థ, తెనాలి ఎంపీడీవో దీప్తి, కొల్లిపర ఎంపీడీవో విజయలక్ష్మి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ లక్ష్మీపతిరావు తదితరులు పాల్గొన్నారు.

ANN TOP 10